ఆ మంత్రిని వదిలేది లేదు, ఇక - కేటీఆర్ వార్నింగ్..!!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేసారు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించారు. ఆడబిడ్డల వేడుక బతుకమ్మకు ఏర్పాట్లు చేయటానికి మనసు రావటం లేదా అని నిలదీసారు. అదే విధంగా మూసీ వెనుక ఉన్న ముసుగు వీరులెవరని ప్రశ్నించిన కేటీఆర్..తన పైన అసత్య ఆరోపణలు చేసిన ఆ మంత్రిని మాత్రం వదిలేది లేదని తేల్చి చెప్పారు.
రేవంత్ పై గురి
మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. పలు అంశాల పైన నిలదీసారు. పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. చెత్తా, చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాలా అని కేటీఆర్ ధ్వజమెత్తారు. పత్రికల్లో వచ్చిన కధనాలను జత చేస్తూ ట్వీట్ చేసారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, చెరువు కట్ట మీద లైట్లు పెట్టడానికి పంచాయతీల్లో పైసల్లేని పరిస్థితులు దాపురించాయని నిలదీసారు.

పండుగ నిర్వహించలేరా
రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందని ఆవేదన చెందారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను స్వచ్ఛమైన పరిసరాల్లో చేసుకునే భాగ్యం కూడా మహిళలకు లేదా అని అడిగారు. బతుకమ్మ చీరలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. దీనికి కొనసాగింపుగా చేసిన మరో ట్వీట్ లో మూసీ నది వెనుక దాక్కున్న ముసుగు దొంగలు ఎవరని ప్రశ్నించారు.
ముసుగు వీరుడెవరు
రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరని అడిగారు. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరని ప్రశ్నించారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 ఇస్తానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడు ఎవరని ఆయన అడిగారు. అవ్వ, తాతలకు నెలకు రూ.4000 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరని ప్రశ్నించారు. తన పైన అసత్య ఆరోపణలు చేసిన మంత్రికి ఇప్పటికే నోటీసులు పంపానని..ఆ మంత్రిని మాత్రం వదిలేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications