సినిమా చూపించినట్లవుతుంది, ఆంధ్రుల ఓట్లతోనే గెలుస్తాం: కెటిఆర్
హైదరాబాద్: తమ ప్రభుత్వం చేసినవి, చేస్తున్నవీ చెప్తే సినిమా చూపించినట్లవుతుందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు కెటి రామారావు అన్నారు. గురువారంనాడు ఉప్పల్ నియోజకవర్గానికి వివిధ పార్టీలకు చెందినవారు టిఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రవాళ్లు సంక్రాంతికి ఊళ్లకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాతనే జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహిస్తామని, ఆంధ్రావాళ్ల ఓట్లతోనే తాము గెలుస్తామని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే అనర్థాలు జరుగుతాయని దుష్ప్రచారం చేశారని సీమాంధ్రులకు ఎవరికైనా నష్టం జరిగిందా అని ఆయన అన్నారు. విభజన జరిగితే మంచి జరుగుతుందని తాము చెప్పామని, తాము చెప్పినట్లే ఎపికి కొత్త రాజధాని, పోర్టు, విద్యాసంస్థలు వచ్చాయని ఆయన చెప్పారు.

టిఆర్ఎస్ పాలనలో బ్రాండ్ హైదరాబాద్ డ్యామేజీ హైదరాబాదుగా మారిందనే కాంగ్రెసు నేత షబ్బీర్ అలీ విమర్శలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాదుకు తరలి వస్తున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాదులోని పేదలకు నల్లా, కరెంట్ బిల్లులు రద్దు చేశామని ఆయన చెప్పారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో 75 శాతం సీట్లు మహిళలకు ఇస్తామని, సామాజిక న్యాయం పాటిస్తామని ఆయన చెప్పారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని కూడా చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాబివృద్ధి పథకాలను చేపడుతున్నారని మంత్రి అన్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాభివృద్దికి గత పాలకులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కానీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ మురికి వాడల్లో తిరిగి పేదల కష్టాలు తెలుసుకున్నారని వివరించారు. గతంలో మురికి వాడల్లో తిరిగిన ముఖ్యమంత్రులెవరు లేరని గుర్తు చేశారు.
ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుందామని తాము ఆనాడే చెప్పామన్నారు. ఇక్కడ ఆంధ్రోళ్లకు పెన్షన్లు ఇవ్వొద్దని, ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ఎవరైనా అన్నారా? అని అడిగారు. ప్రజలమంతా కలిసే ఉన్నామని నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications