సీఎం రేవంత్ ఏడాది పాలన.. ఇజ్జత్ తీసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవం పేరుతో ఉత్సవాలను నిర్వహించటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ రెడీ అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 11 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఆయన టార్గెట్ చేశారు.
కాంగ్రెస్ ఏడాది పాలన టార్గెట్ చేసిన కేటీఆర్
తెలంగాణలో ప్రజా పాలన సాగిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా భూములు మాకేనని ఎదిరించిన రైతులను అక్రమ కేసులతో జైలకు పంపుతున్నారని, రేవంత్ పాలనలో సంక్షేమం లేదని అభివృద్ధి కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట అంటూ సెటైర్లు వేసిన కేటీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను టార్గెట్ చేశారు.

సంక్షేమ గురుకులాలకు తాళాలు
సంక్షేమ గురుకుల పాఠశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గాని తొమ్మిది నెలలకు మూడు నెల బిల్లులు చెల్లించారు అంటూ ఇదేనా సంక్షేమం ఇదేనా అభివృద్ధి అని టార్గెట్ చేశారు. ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకుండా నాణ్యత లేకుండా విద్యార్థులకు భోజనం పెడితే జైలుకేనని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేసారని మండిపడ్డారు.
ధాన్యం, పత్తి కొనుగోళ్ళు లేక రైతుల బాధలు
రాష్ట్రంలో 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని పేర్కొన్న కేటీఆర్ వందలాది గురుకుల పాఠశాలలో వసతి గృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉందని పేర్కొన్నారు. వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టక ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వంలో చలనం రాక రైతన్నలు అడ్డుకి పావు సేరు కింద తాము ఆరుగాలం చేసిన కష్టాన్ని అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.
హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదల బతుకుల్లో నిప్పులు
అంతే కాదు హైడ్రా, మూసి సుందరీకరణ పేరుతో హైదరాబాద్ లోని పేదల బతుకులు నిప్పులు పోసి కంటికి కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫార్మా సిటీకి సేకరించిన భూమిని పక్కనపెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారని, మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపారని పేర్కొన్నారు.
కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురు చూస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైందని, అభివృద్ధి దూరమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరబోతుందని కేటీఆర్ వెల్లడించారు. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తంగా విజయోత్సవ సంబరాలు జరపాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పటివరకు సాగించిన పాలనను కేటీఆర్ టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications