హైదరాబాద్‌లో కాల్ అవే గోల్ఫ్ కంపెనీ పెట్టుబడులు: అమెరికాలో కేటీఆర్ వరుస భేటీలు
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో బిజి బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు. తాజాగా, హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌లో ఒప్పందం చేసుకున్నారు.
టాప్ గోల్ఫ్ బ్రాండ్‌గా కాల్ అవే కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో కాల్ అవే నెలకొల్పనున్న డిజిటెక్ సెంటర్ ద్వారా కొత్తగా 300 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిజిటెక్ సెంటర్‌తోపాటు గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కొరకు రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ కోరారు.

తెలంగాణలో స్పోర్ట్స్ టూరిజంలో భాగం కావాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. తన పర్యటనలో భాగంగా ఫిస్కర్ సంస్థ ఛైర్మన్, సీఈఓతో కేటీఆర్ బృందం సమావేశమైంది. భేటీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విషయంలో రాష్ట్రం అవలంభిస్తోన్న విధానానలను ఫిస్కర్ సంస్థ ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా కోరారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు ఫిస్కర్ సంస్థకు చెందిన బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించనుంది.
తొలిరోజు పర్యటనలో..
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. శాండియాగో లోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్ వేద కంపెనీకి పేరుంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది.
కేవలం 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపింది. తెలంగాణలో పెట్టుపెడులు పెట్టేందుకు ఆసక్తిచూపిన కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications