తెలంగాణ జాతిపిత కేసీఆరే.. బూతుపిత మాత్రం ఆయనే!
తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతారంటూ ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరేమన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని.. తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి అని అభివర్ణించారు.
గతంలో అనేక రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ.. ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపువేగంతో దూసుకెళ్లింది మన తెలంగాణేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం మనందరికి గర్వ కారణమన్నారు. గత పదేళ్లలో అభివృద్ధి పథంలో మెరుపు వేగాన్ని ఆవిష్కరించి తెలంగాణను అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారని కొనియాడారు.

2014 నుంచి 2022 వరకు వృద్ధి రేటు తీసుకుంటే 17.57 శాతంతో అగ్రగామిగా తెలంగాణ నిలబడిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుసరిస్తోందన్నారు. తమకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడకపోవడం బాధ కలిగించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని విమర్శించారని గుర్తు చేసిన కేటీఆర్.. తమకు వచ్చింది సున్నానే మరి.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా అని నిలదీశారు. కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదని, పోరాడాల్సిందేనని వ్యాఖ్యానించారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు.
సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రతి పనిలో గత ప్రభుత్వమని తమని విమర్శిస్తున్నవారు కేంద్రంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ కావాలంటే ప్రస్తుత ధరల ప్రకారం 35 ఏళ్లు పడుతుందని, పీఎం రెండు కోట్ల ఉద్యోగాలు, సీఎం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తమన్నారని గుర్తు చేశారు.
పీఎం, సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రంతో సఖ్యత వల్ల రేవంత్ రెడ్డి ఏం సాధించారని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులపై ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరికీ పెద్ద అవగాహన లేదు, పదేళ్ల తర్వాత సకల సౌకర్యాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించామని చెప్పుకొచ్చారు. అబద్ధపు హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications