బీఆర్ఎస్ మా దగ్గరికొస్తుంది! అధికారం నిర్ణయించేది మేమే: కూనంనేని సాంబశివరావు
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు.
ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు ఇచ్చినప్పటికీ.. అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు.

ఎవరు అధికారంలోకి రావాలని తామే నిర్ణయిస్తామన్న కూనంనేని
అధికార పార్టీతో పొత్తులు పొత్తులే.. పోరాటం పోరాటమేనని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. అంతేగాక, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలని నిర్ణయించేది కమ్యూనిస్టులేనని వ్యాఖ్యానించారు. టికెట్లు ఒకరు తమకు ఇచ్చేది ఏంటని ప్రశ్నించారు. తమ అవసరం ఉందనుకుంటే తమ వద్దకే బీఆర్ఎస్ వస్తుందన్నారు కూనంనేని. అవసరం లేదనుకుంటే ఎవరిదారి వారిదేనన్నారు.

మోడీపై కూనంనేని విమర్శలు: కేసీఆర్‌కు విన్నపం
ప్రధాని నరేంద్ర మోడీ అదానీ కుంభకోణంపై ఒక్కసారి కూడా నోరు విప్పలేదని కూనంనేని మండిపడ్డారు. పార్లమెంటులో జరుగుతున్న సమయంలో అదానీ స్కాం బయటపడిందన్నారు. జేపీసీ వేయమన్నా.. మోడీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. సీపీఐ పోరాటం వల్లే పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. కరెంట్ లేకపోవడంతో రైతుల పంట ఎండిపోతోందన్నారు. సీఎం కేసీఆర్ దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు.

రేవంత్ రెడ్డి పాదయాత్రలో కావాలని పాల్గొనలేదన్న కూనంనేని
ఏఐటీయూసీ ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర అక్కడికి వచ్చిందని.. అంతే తప్పితే ఏఐటీయూసీ కావాలని పాదయాత్రలో పాల్గొనలేదని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇక సీపీఎం, సీపీఐ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు గానూ సీపీఎం, సీపీఐ కలిసి భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి వామపక్షాలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి వామపక్షాలు కలిసి పనిచేస్తాయనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications