కారు ప్రమాదంలో లేడీ టెక్కీ దుర్మరణం: జల్సాల కోసం చోరీలు
హైదరాబాద్: సహోద్యోగులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. హైరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి వెస్ట్రన్ హిల్స్‌లో నివాసం ఉండే సాయిబాపి రాజు కుమార్తె విజేత (23) ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది.
గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విజేత తన తోటి ఉద్యోగి రవిచంద్ర కారులో మరికొందరు తోటి ఉద్యోగులతో కలిసి మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్తోంది. మార్గమధ్యలో గచ్చిబౌలి బయో డైవర్సిటీ చౌరస్తా దాటిన తరువాత క్వాలిటీ ఇన్ హోటల్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
కారును రవిచంద్ర నిర్లక్ష్యంగా, వేగంగా నడపడంతో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజేతతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆమె తోటి ఉద్యోగులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఆస్పత్రికి చేరుకునే లోపే విజేత మృతి చెందింది. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే, ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సికింద్రాబాదులోని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా కేతాపల్లి మండలం కొత్తపేట ప్రాంతానికి చెందిన వంగాల సైదులు అలియాస్ గణేష్(20) బతుకు దెరువు కోసం చర్లపల్లికి వచ్చి భరత్ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటూ స్థానికంగా ఉన్న హోటల్‌లో పనిచేస్తున్నాడు.
జల్సాలకు అలవాటు పడిన సైదులు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వచ్చిన డబ్బులతో జల్సా చేస్తున్నాడు. చక్రీపురం చౌరస్తా నుంచి చర్లపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి ఐదు గ్రాముల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు సుమారు 1.70 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications