సీఎం కేసీఆర్ హెల్త్‌పై లేటెస్ట్ అప్‌డేట్... టెస్టుల్లో మిశ్రమ ఫలితాలు...
ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యాంటిజెన్,ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితమైన ఫలితాలు తేలలేదు. రెండింటిలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. బుధవారం(ఏప్రిల్ 28) నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో కేసీఆర్‌కు నెగటివ్ వచ్చినప్పటికీ.. ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం కచ్చితమైన ఫలితాలు రాలేదన్నారు.
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఎంవీ రావు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని... 2,3 రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నెల 21న హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఛాతిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని సిటీ స్కాన్‌లో తేలినట్లు వైద్యులు వెల్లడించారు. బుధవారం(ఏప్రిల్ 29) యాంటిజెన్,ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. యాంటిజెన్ టెస్టులో నెగటివ్‌గా తేలింది. ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం కచ్చితమైన ఫలితం రాలేదు.ప్రస్తుతం ఎంవీ రావు నేత్రుత్వంలోని వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఇటీవల మంత్రి కేటీఆర్,టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్నవారికి అవసరమైన సాయం అందిస్తున్నారు కేటీఆర్. వాట్సాప్,ట్విట్టర్ ద్వారా అందుతున్న విజ్ఞప్తులను పరిశీలించి.. వారికి తగిన సాయం అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు.
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ప్రజారోగ్య శాఖ ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. అలాంటి ప్రతిపాదనేది ప్రభుత్వానికి పంపలేదని స్పష్టం చేసింది. తాజాగా మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదన్నారు.












Click it and Unblock the Notifications