• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాయర్ దంపతుల హత్య : ఆ వివాదాలే కారణమా...? గుంజపడుగులో భారీ బందోబస్తు...

|

పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ సమీపంలో జరిగిన లాయర్ దంపతుల హత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. పట్టపగలు.. నడిరోడ్డుపై.. వాహనదారులు చూస్తుండగానే గట్టు వామన్ రావు-నాగమణి దంపతులను దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వామన్‌రావు చెప్పిన 'కుంట శ్రీను' పేరు ఇప్పుడీ కేసులో కీలకంగా మారింది.

వామన్‌రావు,కుంట శ్రీను ఇద్దరి స్వగ్రామం గుంజపడుగు కావడంతో... పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో దీని వెనకాల రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

గుంజపడుగులో భారీ బందోబస్తు...

గుంజపడుగులో భారీ బందోబస్తు...

హత్యకు గురైన వామన్ రావు,నిందితుడిగా భావిస్తున్న కుంట శ్రీనుల స్వగ్రామం గుంజపడుగులో ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వదంతుల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుంట శ్రీను మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తెలుస్తోంది. గతంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతని తల్లి,కుమారుడిని అదుపులోకి విచారిస్తున్నారు.

వామన్‌రావు-కుంట శ్రీను మధ్య వివాదాలు

వామన్‌రావు-కుంట శ్రీను మధ్య వివాదాలు

గ్రామంలో జరిగిన పలు అభివృద్ది పనులకు సంబంధించిన విషయంలో వామన్‌రావు,కుంట శ్రీనుల మధ్య వివాదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. గ్రామంలోని పాఠశాల,పంచాయతీ భవన నిర్మాణాలపై వామన్‌రావు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. అలాగే గ్రామంలో నిర్మించిన ఓ దేవాలయం,కుంట శ్రీను ఇంటి నిర్మాణంపై కూడా ఆయన కోర్టులో కేసులు వేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

మంథనిలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా,కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా కూడా వామన్ రావు దంపతులు కోర్టులో కేసులు వేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆస్తులపై కూడా వామన్‌రావు కేసులు దాఖలు చేశారు.

మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు...

మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు...

తన కుమారుడు, కోడలిని కుంట శ్రీనివాస్‌, తన అనుచరులతో కలిసి హత్య చేశాడని వామన్‌రావు తండ్రి కిషన్ రావు,తల్లి ఇంద్రసేనమ్మ ఆరోపించారు. ఈ హత్య వెనుక జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, గుంజపడుగుకు చెందిన రిటైర్డ్‌ డీఈఈ వసంత్‌రావు హస్తం ఉందని ఆరోపించారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్యకు పాల్పడ్డారని మృతుని సోదరి శారద,మేనల్లుడు శ్రీనాథ్ ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ప్రోద్బలంతోనే ఈ హత్యలు జరిగాయని ఆరోపించారు. హైకోర్టు పర్యవేక్షణలో సిట్ ద్వారా దీనిపై ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఆధారాలు సేకరించిన క్లూస్‌టీమ్

ఆధారాలు సేకరించిన క్లూస్‌టీమ్

కల్వచర్ల వద్ద హత్య జరిగిన స్థలాన్ని క్లూస్ టీమ్ అధికారులు పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. రక్త నమూనాలతో పాటు సంఘటనా స్థలంలో పడిపోయిన వారి వస్తువులను సేకరించారు. కారుపై హంతకుల వేలిముద్రలను పరిశీలించారు. హంతకులు మంథని వైపు పారిపోవడంతో ఆవైపు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

లాయర్ దంపతుల హత్యకు నిరసనగా గురువారం హైకోర్టులో విధులు బహిష్కరించాలని, స్వచ్ఛందంగా నిరసనలో పాల్గొనాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం పిలుపునిచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్‌ అసోయేషన్‌, సిటీ సివిల్‌ కోర్టులు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాంపల్లి కోర్టుల న్యాయవాద సంఘాలు కూడా విధుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ఈ కేసులో నిందితుల తరఫున ఎవరూ వకాలత్‌ వేయరాదని న్యాయవాద వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఘటనపై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణకు వారు డిమాండ్ చేస్తున్నారు.

English summary
lawyer couple murder in peddapalli police deployed in gunjapadugu village
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X