హైదరాబాద్‌లో ఎల్ఎస్ఈ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు: 1000 మందికి ఉపాధి
హైదరాబాద్: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చేపట్టిన మంత్రి కేటీఆర్ యూకే పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని(టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ముందుకొచ్చింది.
ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరానికి నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. మంత్రి కేటీఆర్‌తో లండన్‌లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఈవో అంథోనీ మెక్‌కార్టీ ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలతో ఆంతోనీ మెక్ కార్టీ కుదుర్చుకున్నారు.

తెలంగాణలో ఈ సంస్థ టెక్నాలజీ సెంటర్‌ను నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్య్సూరెన్స్ రంగాలకు అద్భుతమైన ఊతం లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా రంగాల్లో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని మంత్రి వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్చ్సేంచ్ గ్రూప్ దాదాపు 190 దేశాల్లో ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. తన విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవా రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.
లండన్ స్టాక్ ఎక్స్‌చేంజీకి ఘనమైన చరిత్ర ఉన్నది. పురాతన ఎక్స్‌చేంజీల్లో ఇది ఒకటి. యూరప్‌లో ఇది అత్యంత విలువైన స్టాక్ ఎక్స్‌చేంజ్. బ్రిటన్ జనాభాలో 15 శాతం మంది ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో పెట్టుబడులు పెట్టారు. 17వ శతాబ్దంలో బ్రిటన్‌లో రాయల్ ఎక్చ్‌చేంజి ఒక్కటే ఉండేది. దీంట్లో అక్కడి స్టాక్ బ్రోకర్లు లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి లేకపోవడంతో చిన్న స్థాయి ఇన్వెస్టర్లు కలిసి ఒక కాఫీ హౌజ్‌లో దీనిని ప్రారంభించారు.

ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్‌చేంజి యూరప్‌లో అతిపెద్ద స్టాక్ ఎక్స్‌చేంజీల్లో ఒకటిగా ఎదిగింది. కాగా,ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications