కేసీఆర్ పై విరుచుకుపడ్డ కమల దళం.!బీఎస్కే యాత్రపై దాడులు సహించమన్న రాజాసింగ్.!
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రోద్భలంతోపాటు మంత్రి కేటీఆర్ డైరెక్షన్ ప్రకారమే ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేపారు బీజేపీ శాసనసభా పక్షనేత రాజా సింగ్. పాదయాత్ర మొదలు పెట్టకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, దాడులు చేస్తారని ముందే చెప్పారని, సంయమనంతో ఉండాలని చెప్పారని, ఈరోజు బీజేపి యాత్రపై జరిగిన దాడిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజాసింగ్ ధ్వజమెత్తారు.

దాడులు చేయడం రాజకీయ దివాలాకోరుతనం..
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలకు భరోసా కలిగిస్తుంటే, పూర్తి భద్రత కల్పించాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేటన్నారు రాజాసింగ్. చంద్రశేఖర్ రావు రాజకీయ దివాళాకోరుతనానికి ఇది నిదర్శనమన్నారు రాజాసింగ్. అన్ని రంగాల్లో విఫలమైన ముఖ్యమంత్రి ప్రజాగ్రహాన్ని ఎదుర్కోలేక తమ కిరాయి గూండాలతో దాడి చేయించడం హేయమైన చర్య అని, రాష్ట్ర అధ్యక్షుడికి రక్షణ కల్పించలేని వాళ్లు సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని రాజా సింగ్ సూటిగా ప్రశ్నించారు.

దాడులకు ప్రతి దాడులు ఉంటాయి..
భవిష్యత్తులో ఈ ఘటన పునరావ్రుతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్షం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు రాజాసింగ్. ప్రజా సంగ్రామ యాత్ర సాఫీగా కొనసాగేందుకు పూర్తి భద్రత కల్పించాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేసారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహించాలే తప్ప రాజకీయ కుట్రలో ఇరుక్కోవద్దని రాజా సింగ్ సూచించారు.

ప్రజాధరణ చూసి ఓర్వలేని తనం..
ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఈ యాత్రతో టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని బీజేపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అక్కసుతో ప్రజా సంగ్రామ యాత్రను ఎట్లయినా అడ్డుకోవాలని కొంతమంది చిల్లరగాళ్లకు మందు తాగించి పంపిస్తున్నారని ఆరోపించారు. కొందరు చెంచాగాళ్లు, చంద్రశేఖర్ రావు మోచేతి నీళ్లు తాగే నాయకులు అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సంగ్రామ యాత్ర ఆగదన్నారు.

బండి సంజయ్ కనుసైగ చేస్తే బీజేపి కార్యకర్తలు రెచ్చిపోతారు..
ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ నుండి కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని బండి సంజయ్ ముందే పసిగట్టి బయటపెట్టిన అంశం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందేనన్నారు. బండి సంజయ్ కనుసైగ చేస్తే బీజేపీ కార్యకర్తలు తిరగబడతారని, తమ పార్టీ కార్యకర్తలు తిరగబడితే టీఆర్ఎస్ ఉంటదా? ఖబడ్దార్ చంద్రశేఖర్ రావు అని హెచ్చరించారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, చంద్రశేఖర్ రావు ప్రభుత్వం గత 8 ఏళ్లుగా చేస్తున్న మోసాలను బయట పెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారని, అందుకే సంయమనంతో ఉన్నామన్నారు. తమ ఓపికను చేతగానితనంగా భావించొద్దని గుజ్జల ప్రేమేందర్ రెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications