వీడిన మిస్టరీ .. దిశా తరహా యువతి అత్యాచారం,హత్యలో ప్రియుడే నిందితుడు
రంగారెడ్డి జిల్లాలో తంగడపల్లి బ్రిడ్జి క్రింద అత్యాచారం , హత్యకు గురైన యువతి కేసులో మిస్టరీ వీడింది . పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్ గా మారిన నేపధ్యంలో మొత్తానికి 13 రోజుల తర్వాత మిస్టరీని ఛేదించారు పోలీసులు . యువతి ఆనవాలు కూడా గుర్తించకుండా ఆమె ముఖం బండరాయితో ఛిద్రం చెయ్యటంతో ఆమె ఎవరు అనేది గుర్తించటంలో ఇబ్బంది పడిన పోలీసులు ఎట్టకేలకు అసలు నిందితుడిని పట్టుకున్నారు.

తంగడపల్లి వద్ద యువతి హత్యలో వీడిన మిస్టరీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో వంతెన వద్ద దిశా తరహాలో జరిగిన అత్యాచారం , హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మృతురాలిది సిక్కిం రాష్ట్రంగా గుర్తించిన పోలీసులు ఈ కేసులో ఆమె ప్రియుడే ఘాతుకానికి పాల్పడినట్లుగా విచారణలో తేల్చారు. మార్చి 17న ఉదయం తంగడపల్లి శివారులో ఉన్న ఓ వంతెన కింద గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును గుర్తుంచిన పోలీసులు
మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతదేహాన్ని అక్కడ పడేసేందుకు తీసుకొచ్చిన అద్దె కారును గుర్తించారు. ఆ కారు సాయంతోనే కేసును చేధించగలిగారు పోలీసులు. కారును అద్దెకు తీసుకున్న చోట ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వాటి ఆధారంగానే ప్రధాన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు.

ఫేస్ బుక్ ద్వారా పరిచయం .. హత్య.. సిక్కిం కి చెందిన యువతిగా గుర్తింపు
సిక్కిం కి చెందిన మహిళ మిస్సింగ్‌పై సిక్కింలో కేసు కూడా నమోదైంది. ఇక అసలు విషయానికి వస్తే మృతిచెందిన మహళతో నిందితుడికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో ఆవేశంలో ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మరో వ్యక్తి నిందితుడి బంధువు కూడా హత్యకు సహకరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

యువతిని గుర్తించకుండా బండ రాళ్ళతో మోదిన ప్రియుడు
ఇక హత్య చేసిన వారు అనంతరం మృతదేహాన్ని అక్కడ్నుంచి తరలించేందుకు ఓ కారును అద్దెకు తీసుకున్నారని, అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లి వంతెన వద్ద మృతదేహాన్ని పారేసినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే యువతి ముఖంపై బండరాళ్లతో మోదీ ఒంటిపై బట్టలు లేకుండా చేసి అక్కడ్నుంచి పారిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు . ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం నిందితులు ఉపయోగించిన అద్దె కారు ఆధారంగా సీసీ టీవీ ఫుటేజ్ ను బేస్ చేసుకుని కేసులో పురోగతి సాధించారు పోలీసులు .












Click it and Unblock the Notifications