కవిత చేరికపై తేల్చేసిన టీ కాంగ్రెస్ సీనియర్ నేత
K Kavitha: భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోన్నారు. సొంత పార్టీపై ఘాటు విమర్శలు, ఆరోపణలు సంధించడం దీనికి ఓ కారణం కాగా.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొంటారనే ప్రచారం మరో కారణం.
దీనిపై తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు మధు యాష్కీ గౌడ్ స్పందించారు. కవిత చేరిక వార్తలను తోసిపుచ్చారు. కాంగ్రెస్ కంటే- భారతీయ జనతా పార్టీ అవసరం ఆమెకు చాలా ఉందని వ్యాఖ్యానించారు. ఆమెను బీజేపీ వదలిన బాణంగా అభివర్ణించారు. భారీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఈ నాటకాలకు తెర తీశారని విమర్శించారు.

మద్యం కుంభకోణం నుంచి బయటపడటానికి కవితకు బీజేపీ సహకారం అవసరమైందని, కాంగ్రెస్ కంటే ఆమెకు ఆ పార్టీ అవసరాలే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ హైకమాండ్ చెప్పినట్టుగా ఆమె నడుచుకుంటోందంటూ చురకలు అంటించారు. బీజేపీ వ్యూహరచనలో భాగంగానే కేసీఆర్‌కు లేఖ రాశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ బలహీనపడితే ప్రత్యామ్నాయంగా బీజేపీ స్ట్రాంగ్ అవుతుందని, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనీ బలోపేతం చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్ట్రాటజీ అని విమర్శించారు మధు యాష్కీ. బీఆర్ఎస్ ఓటుబ్యాంకును మొత్తం తమ వైపు తిప్పుకోవాలనేది వారి వ్యూహమని అన్నారు.
జాగృతి పేరుతో కవిత భారీ అవినీతికి పాల్పడ్డారని మధు యాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణం దీనికి తోడైందని, పెద్ద ఎత్తున అక్రమాలు, వసూళ్లకు పాల్పడ్డారని అన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, జనం దృష్టిని మరల్చడానికి కేసీఆర్ కు లేఖ పేరుతో కవిత నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.
కవితను కాంగ్రెస్‌లో పార్టీలో చేర్చుకునేంత ఖర్మ తమకు పట్టలేదని మధు యాష్కీ తేల్చి చెప్పారు. జాగృతి పేరుతో అవినీతి వ్యవహారాలు, వసూళ్ల కార్యకలాపాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. కవితకు బంజారాహిల్స్‌లో 2,000 కోట్ల రూపాయల ఆస్తులు, విల్లాలు ఉన్నాయని, ఇదంతా అక్రమంగా సంపాదించిందేనని చెప్పారు.
కవితను లిక్కర్ మాఫియా డాన్ గా పేర్కొన్నారు మధు యాష్కీ గౌడ్. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి జాగృతిని బలోపేతం చేయాలనుకుంటోందని అన్నారు. ఆమె చేయని అక్రమ వ్యాపారం గానీ, దోచుకోని సంస్థ గానీ లేదని అన్నారు. పది సంవత్సరాల తండ్రి పరిపాలనలో ఆమె విపరీతంగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications