ఒంటరి మహిళల్లా లేరే!.. కత్తుల్లా ఉన్నారు: జడ్పీ చైర్మన్ బండారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆయన గారు ఏమంటారంటే!.. 'ఇప్పటిదాకా నడిగడ్డ ప్రాంతంమహిళలే అందంగా ఉంటారనుకున్నా కానీ ఏటి అవతలి మహిళలు కూడా చాలా అందంగా ఉంటారని నిన్ననే తెలిసింది' అంటూ తన పైత్యాన్ని వెల్లగక్కాడు.
మహబూబ్‌నగర్: ఆడవాళ్లనగానే కత్తి.. సుత్తి లాంటి నోటికొచ్చిన పదాలతో వారిని చులకన చేయడం చాలామంది మగవాళ్లకు అలవాటే. ఈ విషయంలో సెలబ్రిటీలు అనుకునేవారు కూడా ఏమాత్రం తక్కువ కాదు. మొన్నీమధ్యే చలపతిరావు అనే సినీ నటుడి పైత్యాన్ని జనం ఇంకా మరిచిపోకముందే.. ఓ బాధ్యతగల ప్రజాప్రతినిధి తన నోటి దురుసును బయటపెట్టుకున్నాడు.
ఆయన గారు ఏమంటారంటే!.. 'ఇప్పటిదాకా నడిగడ్డ ప్రాంతంమహిళలే అందంగా ఉంటారనుకున్నా కానీ ఏటి అవతలి మహిళలు కూడా చాలా అందంగా ఉంటారని నిన్ననే తెలిసింది' అంటూ తన పైత్యాన్ని వెల్లగక్కాడు. అంతేనా!.. ఇక్కడి మహిళలు కత్తుల్లా ఉన్నారంటూ చిల్లర భాషను ఉపయోగించాడు.
ఇదంతా ఒంటరి మహిళల గురించి జడ్పి చైర్మన్ బండారి భాస్కర్ చేసిన వ్యాఖ్యలు. పైగా.. వారి వేషధారణ చూస్తే ఒంటరి మహిళలన్న భావన కలగదని వ్యాఖ్యానించడం ఆయన గారి నిలువెత్తు పురుషాహంకారానికి నిదర్శనం. మహిళల పట్ల ఆయనకెంత చులకన భావముందో ఈ వ్యాఖ్యలు వింటేనే అర్థమవుతోంది.

ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఫించన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో.. మహబూబ్ నగర్‌లోను ఫించన్ల పంపిణీ చేపట్టారు. అర్హులైన ఒంటరి మహిళలు ఈ కార్యక్రమానికి రాగా.. వారిని ఉద్దేశించి భాస్కర్ రావు తన వెకిలి తనాన్ని బయటపెట్టుకున్నాడు.
సరే ఆయన గారికి మతి లేక ఈ వ్యాఖ్యలు చేశాడనుకుంటే.. వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఆయన్ను వారించే ప్రయత్నం చేయలేదు. అదే వేదికపై మంత్రి జూపల్లి కృష్ణారావు సహా తదితర జిల్లా నేతలు ఉన్నట్లు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాస్కర్ రావు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదే కార్యక్రమంలో.. అసలు ఒంటరి మహిళలంటే ఎవరో కూడా తనకు తెలియదని భాస్కర్ రావు అమాయకంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన గారికి ఎవరో వ్యక్తి జ్ఞానోదయం కలిగిస్తే గానీ ఒంటరి మహిళలంటే ఎవరో తెలిసిరాలేదట. చలపతిరావు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహిళా సంఘాలు ఇప్పుడు భాస్కర్ రావుకు ఎలా బుద్ది చెబుతాయో చూడాలి మరి!












Click it and Unblock the Notifications