కెటిఆర్‌తో బాగా ఆలోచించి, సిద్ధాపురం తీసుకుంటున్నా: మహేష్ బాబు
హైదరాబాద్: సినీ నటుడు మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుంటున్నారు.
ఈ విషయాన్ని ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, నేను (మహేష్ బాబు) బాగా ఆలోచించిన తర్వాత సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

కాగా, మహేష్ బాబు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవడంలో ఆయన శనివారం నాడు తొలి అడుగు వేశారు.
తన తండ్రి కృష్ణ సొంతూరు అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేష్ బాబు కొద్ది రోజుల క్రితం చెప్పారు. అందుకు గానూ, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అర్జీ పెట్టుకున్నారు. మహేష్ బాబు దత్తత అంశంపై ఇంటర్నెట్లో అర్జీ పూర్తి చేశారని తెనాలి ఎంపీడీవో చెప్పారు.
After much thought @KTRTRS garu and myself have chosen to adopt Siddhapuram village of Kottur mandal in Mahabubnagar district :)
— Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2015 గ్రామ అవసరాలను గుర్తించేందుకు ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయిస్తున్నారన్నారు. పన్నెండు అంశాల ప్రాతిపదికన గ్రామ సమస్యలను గుర్తిస్తున్నారని చెప్పారు. అలాగే, వనరుల అభివృద్ధి పైన సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు.
మహేష్ బాబు ఏపీలో ఓ గ్రామాన్ని, తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మహేష్ బాబు సోదరి, ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి గల్లా పద్మావతి కూడా ఇప్పటికే తెనాలి మండలంలోని కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. బుర్రిపాలెం హీరో కృష్ణ స్వగ్రామం కాగా, కంచర్లపాలెం మహేష్ బాబు అమ్మమ్మ ఊరు.












Click it and Unblock the Notifications