సాధికారతకు నిలువుటద్దం:ఇకపై మహిళా పోలీసులు గుర్రాలపై గస్తీ..!
తెలంగాణలో మహిళా సాధికారతకు నిలువుటద్దంగా నిలుస్తూ, హైదరాబాద్ పోలీస్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇకపై మహిళా పోలీసులు కూడా గుర్రాలపై గస్తీ నిర్వహించనున్నారు. ఈరోజు, శనివారం జరిగే గణేష్ విగ్రహాల నిమజ్జనంలో తొలిసారిగా 10 మంది మహిళా కానిస్టేబుళ్లు అశ్వదళం (మౌంటెడ్ పోలీస్)లో భాగమై తమ విధులు నిర్వర్తించారు.వీరంతా ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) విభాగం నుంచి ఎంపికై, గోషామహల్ అశ్వదళం శిక్షణా కేంద్రంలో రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. వారి మొదటి అధికారిక విధి గణేష్ నిమజ్జనం బందోబస్తు కావడం విశేషం.
కఠినమైన శిక్షణ.. అపారమైన ఆత్మవిశ్వాసం
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ శుక్రవారం ఈ విషయంపై మీడియా మాట్లాడారు.మహిళా పోలీసులు అత్యంత కఠినమైన, డిమాండింగ్ విభాగాల్లోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని చెప్పారు.ఇకపై మహిళా అశ్వదళం సిబ్బందిని సాధారణ పెట్రోలింగ్, వీఐపీల భద్రత, బందోబస్తు వంటి అన్ని విధులకు ఉపయోగిస్తామని వివరించారు.

నూతనంగా శిక్షణ పొందిన కానిస్టేబుళ్లలో ఒకరు మాట్లాడుతూ..ఈ ప్రయాణం అంత సులభమైంది కాదన్నారు.మొదట్లో చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్న మహిళా కానిస్టేబుల్... పృథ్వీ సింగ్ మార్గదర్శకత్వంలో ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు.గుర్రాల కదలికలు,వాటిని ఎలా అదుపు చేయాలి వంటి అంశాలను ఆయన తమకు నేర్పించినట్లు వివరించారు.ఇప్పుడు జనసందోహాన్ని, గుర్రాలను రెండింటినీ నియంత్రించగలమన్న ఆత్మవిశ్వాసం తమలో పెరిగిందని చెప్పారు.
ఈ శిక్షణ కేవలం గుర్రపు స్వారీకి మాత్రమే పరిమితం కాలేదని ఆమె వివరించారు.జనసందోహం మధ్య గుర్రాన్ని నడపడం ఒక ఎత్తయితే, ప్రజలను, గుర్రాన్ని ఒకేసారి నియంత్రించడం లేదా అదుపు చేయడం అనేది ఒక పెద్ద సవాలని పేర్కొన్నారు. గణేష్ నిమజ్జన విధులకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఉత్సాహంగా అన్నారు.
గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
ఈరోజు ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు మొదలైంది.నిమజ్జన వేడుకల కోసం 30,000 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు మెట్రో సేవలు అర్ధరాత్రి 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. ఈసారి దాదాపు 60,000 విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ భద్రతా ఏర్పాట్లలో అశ్వదళం కూడా భాగం కావడం, అందులో మహిళా పోలీసులు అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.












Click it and Unblock the Notifications