చివరి నిముషంలో KCRకి హ్యాండిచ్చిన ఆ ఇద్దరూ..!?
దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీకి గట్టి ప్రత్యర్థిగా ఎదగడానికి భారత రాష్ట్ర సమితి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లాలని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక నుంచి జేడీయూ నేత కుమారస్వామి ఆయనకు మిత్రపక్షంగా ఉన్నారు. అలాగే తెలంగాణలో పవన్ కల్యాణ్ కూడా సన్నిహితుడే. రానున్న నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా ఉధృతంగా పర్యటించాలని ప్రణాళిక రచించుకుంటున్నారు.

అఖిలేష్ యాదవ్, కుమారస్వామే..!!
ఢిల్లీ వీధులను బీఆర్ఎస్ ఫ్లెక్సీలతో నింపేశారు. సర్దార్ పటేల్ రోడ్డులో తాత్కాలిక కార్యాలయం నుంచి కార్యక్రమాలు జరగనున్నాయి. త్వరలోనే శాశ్వత కార్యాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నారు. కార్యాలయం ప్రారంభానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీయూ నేత కుమారస్వామి, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో చివరి నిముషంలో ఇద్దరు నేతలు కేసీఆర్ కు హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.

నితీష్ కుమార్, మమతాబెనర్జీ ఏరి?
ఈ క్రమంలో కేసీఆర్ గతంలోనే పలువురు నేతలను కలిసి మద్దతు సంపాదించారు. అయితే అప్పుడు కలిసినవారిలో ఇద్దరు మాత్రం కలిసివచ్చే పరిస్థితులు లేవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా ఎన్డీయేతర, యూపీయేతర పార్టీల నేతలంతా కేసీఆర్ తో కలిసివచ్చే అవకాశాలు కనపడటంలేదని ఢిల్లీలోని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాను రానున్న ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండనని, అలాగే ప్రధానమంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని చెబుతున్నారు.

స్పష్టత లేని జాతీయ రాజకీయం!
వాస్తవానికి కేసీఆర్ తో కలవాల్సిన నితీష్ ఒంటరిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలో బీఆర్ ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరవలేదు. ఆహ్వానం అందిందా? లేదా? అనే విషయంపై స్పష్టత రాలేదు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేసీఆర్ తో కలిసి ముందుకు సాగాలనుకున్నప్పటికీ ఎందుకనో ఆమె వెనుకంజ వేశారు. ఆమె కూడా నితీష్ బాటలో పయనిస్తున్నారు. జార్కండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితర నేతలంతా నితీష్ వైపు మొగ్గుచూపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో తాను కలుపుకొని వెళ్లాలి అనుకుంటున్నవారంతా, ప్రధానంగా నితీష్, మమతా హ్యాండిస్తున్నట్లుగా రాజకీయ వాతావరణం కనపడుతోంది. ఢిల్లీలోనే ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గైర్హాజరవడం గమనార్హం.












Click it and Unblock the Notifications