తెలంగాణలో ఆ విమానాశ్రయంపై శుభవార్త.. రేవంత్ తగ్గట్లేదుగా!
తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలోని మామునూరు కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ కోసం ప్రభుత్వం 295 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీంతో మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి.
అయోధ్య ఎయిర్ పోర్ట్ తరహాలో మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూములను కేంద్రానికి అప్పగించిన వెంటనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులను మొదలు పెట్టనుంది. అయితే ఈ క్రమంలో తాజాగా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య ఏర్పోర్ట్ తరహాలో మామునూరు విమానాశ్రయ నిర్మాణాన్ని చేయాలని భావిస్తోంది.

తక్కువ సమయంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం ప్లాన్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య ఏర్పోర్ట్ తరహాలో మామునూరు విమానాశ్రయ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మామునూరు విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేయడానికి పరిహారాన్ని పెంచడంతోపాటు, ఈ క్రమంలోనే 295 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు.
20 నెలల్లోనే అయోధ్య ఎయిర్ పోర్ట్ నిర్మాణం.. సేవలు ప్రారంభం
ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 50 శాతం భూసేకరణ పూర్తయింది. మిగతా పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. అయోధ్యలో ఉన్నటువంటి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఏ ఏ ఐ కేవలం 20 నెలల్లోనే పూర్తి చేసింది. 821 ఎకరాలలో 1625 కోట్ల రూపాయలతో మూడు దశల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తి చేసుకొని విమాన సేవలు ప్రారంభించింది.
వచ్చే ఏడాది చివరి నాటికి విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి లక్ష్యం
రెండేళ్ల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి సేవలను ప్రయాణికులకు అందిస్తున్నారు. ఇదే తరహాలో మామునూరు విమానాశ్రయాన్ని కూడా 20 నెలల్లో పూర్తి చేసి విమాన సర్వీసులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే సంవత్సరం చివరినాటికి విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేసి విమాన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ ఆ దిశగా వేగాన్ని పెంచింది.












Click it and Unblock the Notifications