ఉద్యోగం వస్తుందని అన్నావదినలను చంపేసిన యువకుడు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు అత్యంత దారుణమైన చర్యకు ఒడిగట్టాడు. తనకు ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో అన్నను, వదినను హత్య చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని ఇల్లందు పట్టణం సాయిబాబా టెంపుల్ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
అన్నావదినలను చంపిన తర్వాత అతను పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇల్లందు పట్టణానికి చెందిన విజయ్ కుమార్ (38), సామ్యన్ (34) అన్నదమ్ములు. వీరి తల్లి సింగరేణిలో ఉద్యోగి. సామ్యన్ నిత్యం మద్యం సేవిస్తూ గొడవ పడుతూ ఉండేవాడు.

తల్లి ఉద్యోగం తనకే ఇవ్వాలని గొడవ పెడుతుండేవాడు. అన్నను చంపేస్తే తనకే ఉద్యోగం వస్తుందని భావించి దారుణానికి ఒడిగట్టాడు. పథకం ప్రకారం సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో కత్తితో అన్నను, వదిన సులోచన (30)ను చంపేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బిటెక్ విద్యార్థిని అదృశ్యం
ఖమ్మం జిల్లాకు చెందిన కోంపల్లి కుసుమ (19) హైదరాబాదులోని బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో మేనమామ వెంకటరమణారావు ఇంట్లో ఉంటూ బిటెక్ చదువుతోంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో జిరాక్స్ కోసమని బయటకు వెళ్లిన కుసుమ కనిపించకుండా పోయింది. దీంతో మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications