ఓ భర్త దురాగతం: పెట్రోల్ పోసి భార్యబిడ్డల్ని నిప్పంటించాడు
హైదరాబాద్: అదనపు కట్నం కోసం ఓ ఉన్మాది కట్టుకున్న భార్య, మూడేళ్ల కూతురిని హత్య చేసి ఆపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే ఇది హత్య అని పోలీసులకు తెలియడంతో పరారయ్యాడు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని కర్నాల్ పల్లి గ్రామశివారులో చోటు చేసుకున్న ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం... చేగుంట మండలంలోని చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ (22) వివాహం నాలుగేళ్ల క్రితం కర్నాల్ పల్లికి చెందిన చింతాకుల ఎల్లంతో జరిగింది. పెళ్లికి రూ. 5 లక్షల కట్నం కూడా ఇచ్చారు. కొన్నాళ్ల పాటు వీరిద్దరూ సాఫీగానే జీవించారు. దీంతో వీరికి కూతురు శృతి (3) ఉంది.
శనివారం ఉదయం ఎల్లవ్వ కూలీ పనులకు వెళ్లి ఉదయం 10 గంటలకు ఇంటికి తిరిగొచ్చింది. ఆమె ఇంటికి రాగానే భర్త ఎల్లం, అత్తమామ, మరిది అదనపు కట్నం తీసుకురావాలని గొడవపడ్డారు. వాగ్వాదం పెరగడంతో ఎల్లవ్వ తన కుమార్తును తీసుకొని వ్యవసాయ బోరు వద్దకు వెళ్లింది.

కొద్దిసేపటికే భర్త ఎల్లం అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఎల్లం మరోమారు గొడవకు దిగి భార్య, కూతురిని హత్య చేశాడు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించాడు. గ్రామంలోకి వెళ్లి వారిద్దరి కోసం వెతికాడు. చివరికి రాత్రి తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు వెతుకుతున్న సమయంలో చేగుంట-గజ్వేల్ రోడ్డుకు పక్కనే ఉన్న చెరువు కట్ట వద్ద తల్లి, కుమార్తెల మృతదేహాలు కనిపించాయి. రామాయంపేట సీఐ నందీశ్వర్ రెడ్డి, ఎస్ ఐ శ్రీనివాసరెడ్డితో కలిసి తూఫ్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
అక్కడ హత్య చేసి నిప్పంటించినట్లు ఆనవాళ్లు లభించడంతో విషయం వెలుగుచూసింది. తమ అల్లుడు, వారి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తమ కూతురిని వేధించేవారని ఎల్లవ్వ తల్లి ఆరోపించారు. ఎల్లంతో పాటు అతని కుటుంబ సభ్యులపై హత్యానేరం కిదం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications