వెంకట మాధవి హత్యపై ఎన్నో అనుమానాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంకట మాధవి హత్య హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వెంకట మాధవిని అత్యంత క్రూరంగా హత్యచేయడమే కాకుండా ప్రెజర్ కుకర్‌లో ఉడికించి, ఎముకలను మాంసం నుండి వేరు చేసి, ఆ ఎముకలను దంచి పొడి చేసి చెరువులో కలిపాడని సోషల్ మీడియాలో కొంతమంది దగ్గరుండి చూసినట్టు ఒకటికి పదిసార్లు వర్ణిస్తున్నారు. అంతకు ముందు ఒక కుక్కను కూడా చంపేసి కుకర్ లో ఉడికించి కుక్క మాంసాన్ని డ్రైనేజీలో కలిపినట్టు మరో కథనాన్ని కూడా పదే పదే చెప్పుకొస్తున్నారు. మరి కొంత మంది ఔత్సిహిక రిపోర్టర్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎముకల పొడిని ప్రయోగశాలకు పంపించారని నిర్ధారణ చేసుకోకుండా గాలివాటంగా చెప్పుకొస్తున్నారు. ఏ అంశం పోలీసులు పరిధిలో ఉంది. మీడియా ఎంత వరకూ ప్రచారం కల్పించాలనే విజ్ఞత లేకుండా నోటికొచ్చిన అంశాన్ని విచ్చలవిడిగా కక్కేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం.?అసలు ఇదే అంశంలో జరిగిన కొన్న అంశాలను ఒకసారి హేతుబద్దంగా విశ్లేషించుకుందాం.
వెంకట మాధవి హత్యకు ముందు గురుమూర్తి ఓ కుక్క చంపి కుకర్ లో ఉడికించి డ్రైనేజీలో కలిపేసాడని బాగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఉన్న వాస్తవం ఎంత.?కుక్కను చంపి కుకర్ ఉడికించడం అంత సులువైన పనేనా.? కుక్కను చంపుతున్నప్పుడు అది మొరగలేదా? చుట్టుపక్కల వాళ్లు గమనించలేదా? చంపిన తర్వాత ముక్కలు చేసి కుకర్ లో ఉడికించే క్రమంలో కుకర్ నుండి వింత వాసన రాలేదా? సాధారణంగా చికెన్, మటన్ వండుతున్నప్పుడు "ఏందమ్మో మసాలా ఘాటు దంచికొడుతుంది" అంటారు పక్కవాళ్లు. మరి కుక్కను వండుతున్నప్పుడు ఏంటి ఈ విచిత్ర వాసన అని ఎవరూ అడగలేదా? దాదాపు 15 కిలోలు ఉండే కుక్కను ఉడికించడానికి ఎంత పెద్ద కుకర్ కావాలి? కానీ గురుమూర్తి ఇంట్లో ఉన్న కుకర్ కెపాసిటీ ఎంత? కుక్కను ముక్కలు చేసి ఒకేసారి ఉడికించడం ఆ కుకర్ లో సాద్యమేనా.? ఈ రిపోర్టర్ లు సమాచారం ఇస్తున్నారా.? సంచలనం కోసం వాగుతున్నారా.?

ఇక వెంకట మాధవి విషయానికి వద్దాం. వెంకట మాధవిని గురుమూర్తి అత్యంత పాశవికంగా హత్య చేసి ఉండి ఉండవచ్చు. శరీర భాగాలను కట్ చేసి ఉండి ఉండవచ్చు. కాని మాధవి శరీరాన్ని ఒకరు 70భాగాలు అని, మరోకరు 60భాగాలుగా ముక్కలు చేసాడని వర్ణిస్తున్నారు. కట్ చేస్తున్నప్పుడు కిటికీ సందులో నుండి చూసినట్టే ఊదరగొడుతున్నారు. వెంకట మాధవిని ముక్కలు చేస్తున్నప్పుడు రక్తం కారలేదా? ఆ రక్తం అంతా ఎటు పోయినట్టు.? గురుమూర్తి తాగేసాడా? ఒక కోడిని కోస్తేనే ఎంత రక్తం వస్తుందో మనకు తెలుసు.
మరి మనిషిని కోస్తున్నప్పుడు వచ్చే రక్తం గురించి ఏంటి? ఇక దాదాపు 60నుండి 70 కిలోల బరువు ఉండే మహిళ మృతదేహాన్ని ఉడికించడానికి ఎంత పెద్ద కుకర్ కావాలి?గురుమూర్తి వంటగదిలో ఉండే రెండుకిలోల కెపాసిటీ కుకర్ లోనే వెంకట మాధవిని మెత్తగా, ఎముకలకు పట్టిన కండ ఊడిపోయేలాగా ఉడికించాడా? ఇదంతా ఏకకాలంలోనే జరిగిందా? అలాకాకుండా కిలోల లెక్కన ఉడకబెట్టినా కుకర్ ఎన్ని విజిల్స్ వేయాలి? ఎవ్వరికీ అనుమానం రాలేదా? కనీసం కుకర్ నుండి ఏంటి ఈ వింత వాసన అనే సందేహం కూడా ఇరుగుపొరుగు వారికి కలగలేదా?మన సోషల్ మీడియా బ్రదర్స్ వర్ణిస్తున్నదాని ప్రకారం ఉడికిన తర్వాత మాంసాన్ని ఎముకల నుండి వేరు చేసి, ఆ ఎముకలను దంచి పొడి చేసి ఆ పోడిని గురుమూర్తి చెరువులో పడేసాడని వివరిస్తున్నారు.
మనిషి శరీరంలో ఉండే ఎముకలను దంచి పొడిచేయడం అంత సులువైన పనా.? క్రూరత్వానికి పైశాచికత్వాన్ని జోడించి ప్రజలకు రుద్దడం తప్ప కొంతైనా వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కనీసం ఓ డాక్టర్, ఓ పోలీసు అధికారి వివరణ తీసుకోకుండా సొంతంగా, వెంకట మాధవి మర్డర్ వ్యవహారాన్ని గురుమూర్తి వచ్చి తమ చెవిలో అంతా చెప్పేసాడనే రేంజ్ లో వర్ణించడం చూస్తుంటే ఒక రకంగా జాలేస్తుంది. నవ్వొస్తుంది. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఏదో సమాచారాన్ని ప్రజలకు చెప్పాలని మీడియాకు ఉంటుంది. అందులో తప్పులేదు. కానీ విషయాన్ని చెప్పే క్రమంలో ప్రదర్శించే అత్యుత్సాహమే ఆయా మీడియా సంస్థలను నవ్వులపాలు చేస్తుంది. వార్తల పట్ల ఏహ్యభావాన్ని కలిగిస్తుంటుంది. వాస్తవాలను చెప్పే కొన్ని జెన్యూన్ మీడియా సంస్థల పట్ల కూడా సందేహాలు రేకెస్తుంటుంది. కాబట్టి మీడియా రిపోర్టింగ్ ఇచ్చేప్పుడు స్వీయ నియంత్రణ, వాస్తవ పరిణామాలు వివరిస్తే బాగుంటుంది.












Click it and Unblock the Notifications