Chokka Rao: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ - మారేడుబాక అడవుల్లో రెండు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత కూడా మృతి చెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్లు తాజాగా మావోయిస్టు పార్టీ వెల్లడించింది.
చొక్కారావుపై గతంలో రూ. 50 లక్షల రివార్డు ఉంది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. బీజాపూర్ ఎన్ కౌంటర్‌లో మొత్తం 18 మంది మావోయిస్టులు మరణించినట్లు మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా గతంలో వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021లో కోవిడ్ బారినపడి మరణించాడు. అప్పట్నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టు పార్టీ పలువురి పేర్లు పరిశీలించింది. ఈ క్రమంలో ఆజాద్ పేరు వినిపించినప్పటికీ.. చివరకు చొక్కారావు పేరు ఖరారైంది.
తెలంగాణ జిల్లాల్లో మంచి పట్టున్న చొక్కారావు.. ఏటూరునాగారం, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో యాక్టివ్ గా పనిచేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావు నియామకంతో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పునరుద్ధరణకు కొంత సహాయపడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్‌కౌంటర్‌లో చొక్కారావు మృతి చెందడం మావోయిస్టు పార్టీకి భారీ నష్టమేనని చెప్పవచ్చు.
కాగా, భారీ ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు భారీ ఎత్తున మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో భారీ బంకర్ ను గుర్తించాయి. ఇందులో సొరంగల్ దేశవాళీ రాకెట్ లాంచర్లు, పెద్దఎత్తున యంత్రాలు, మందుగుండు సామాగ్రి, విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్లు లభించాయి.












Click it and Unblock the Notifications