మావోయిస్టు నేత కల్పన అలియాస్ సుజాత అరెస్ట్: ఆమెపై రూ. కోటి రివార్డు
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్ జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఓ బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
కల్పన అలియాస్ సుజాత, మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో 2011లో పశ్చిమ బెంగాల్ జార్‌గ్రామ్‌లోని బురిషోల్ జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.

కిషన్ జీ భార్య సుజాత కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు. సుజాతపై పోలీసులు కోటి రూపాయల రివార్డును ప్రకటించడం గమనార్హం.
సుజాత.. ఛత్తీస్‌గఢ్ సౌత్ బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉంటున్నారని, అయితే, పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసుకునే ఆమె ఎందుకు బయటకు వచ్చారనే విషయం తెలియరాలేదు. వైద్య పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చారా? షెల్టర్ జోన్‌లో ఉంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది. సూజాత క్రాంతికారీ జనతన్ సర్కారు వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను అరెస్టుపై పోలీసు వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు. ఆమెను మహబూబ్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారా? కొత్తగూడెంలోనా? అనేది స్పష్టం రాలేదు.












Click it and Unblock the Notifications