కందుల శిరీష అరెస్ట్- ఎన్ఐఏ వలలో దుడ్డు ప్రభాకర్ కూడా
న్యూఢిల్లీ/హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే భార్య కందుల శిరీష అలియాస్ శిరీష అలియాస్ పద్మక్క అరెస్ట్ అయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఆమెను అరెస్టు చేసింది. ఆమెతో పాటు దుడ్డు ప్రభాకర్ అలియాస్ దుడ్డు అలియాస్ అజయ్ కూడా అరెస్ట్ అయ్యారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు కొద్దిసేపటి కిందటే ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. పలు కీలక అంశాలను ఇందులో ప్రస్తావించింది.
కందుల శిరీష, దుడ్డు ప్రభాకర్.. మావోయిస్టు గ్రూప్‌లల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. వివిధ సంస్థలు, అనుబంధ విభాగాల్లో పని చేస్తున్నారు. గతంలో సాయుధ క్యాడర్‌లో టెక్ ఇన్‌ఛార్జ్‌గా చురుకుగా పని చేశారు. శిరీష, దుడ్డు ప్రభాకర్‌కు మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున నిధులు లభించేవని ఎన్ఐఏ తెలిపింది.

మావోయిస్ట్ భావజాలాన్ని వ్యాపింప చేయడానికి వాటి అనుబంధ విభాగాల్లో క్రియాశీలకంగా పని చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. అరెస్టయిన నిందితులు ఇద్దరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేలా గతంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది. మావోయిస్ట్ అగ్ర నాయకులతో సన్నిహితంగా పని చేశారని పేర్కొంది.
శిరీష, దుడ్డు ప్రభాకర్ నివాసాల్లో సోదాలు చేసిన సమయంలో కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వివరించింది. 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని తిరియా గ్రామ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో శిరీష, దుడ్డు ప్రభాకర్‌కు సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ దాడిలో ఆరుమంది మావోయిస్టులు, ఓ పౌరుడు మరణించారు.
తిరియా ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్లతో పాటు, ఆర్ కే డైరీలో కందుల శిరీష, దుడ్డు ప్రభాకర్ పేర్లు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ తన ప్రకటనలో తెలిపింది. వాటి ఆధారంగానే తాజాగా ఇద్దరినీ అరెస్ట్ చేశామని, అనేక చోట్ల గాలింపు చర్యల తరువాత వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications