మేడారం జాతర 2022 తేదీలు ఖరారు -ఫిబ్రవరి 16-19 మధ్య -కరోనా వల్ల మే1 నుంచి దర్శనాలు నిలిపివేత
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2022 ఏడాదికిగానూ మాఘమాసంలో నాలుగురోజులపాటు పెద్ద జాతర జరుగనుంది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర తేదీలుగా మేడారం ఆలయ పూజారులు ప్రకటించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకురావడంతో జాతర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు. ఫిబ్రవరి 18న సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకుంటారు. ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశంతో మహా జాతర ముగుస్తుందని పూజారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే,

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా మేడారం పూజారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి 15 వరకు మేడారం అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 8126 కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. మేడారం కొలువైఉన్న ములుగు జిల్లాలో కొత్తగా 63 కేసులు వెలుగుచూశాయి. ములుగును ఆనుకుని ఉండే వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో కొత్తగా 175, 334 కేసులు వచ్చాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆలయాల్లో దర్శనాలు రద్దు చేశారు.












Click it and Unblock the Notifications