తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీని కాంగ్రెస్ అధిష్టానం మార్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమించారు. తెలంగాణతోపాటు మరో 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇంఛార్జీలను నియమించారు.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ కొనసాగనున్నారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందంలో ఈమె కీలకంగా ఉన్నారు. గత కొంత కాలంగా దీపాదాస్ మున్షీని కాంగ్రెస్ వ్యవహారాల నుంచి తప్పిస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ నియామకం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హిమాచల్‌ప్రదేశ్, ఛండీగఢ్ కొత్త ఇంఛార్జీగా రజనీ పాటిల్, హర్యానా కాంగ్రెస్ ఇంఛార్జీగా బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా హరీశ్ చౌదరి, తమిళనాడు, పుదుచ్చేరి ఇంఛార్జీగా గిరీశ్ చౌడాంకర్, ఒడిశా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా అజయ్ కుమార్ లుల్లా నియమితులయ్యారు.
ఇక, జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా కే రాజు, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ ఇంఛార్జీగా సప్తగిరి శంకర్ ఉల్కా, బీహార్ ఇంఛార్జీగా కృష్ణ అల్లవారులను నియమిస్తూ ఏఐసీసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇక, పంజాబ్, జమ్మూకాశ్మీర్ లకు కొత్త జనరల్ సెక్రటరీలను నియమించింది.












Click it and Unblock the Notifications