మాట తప్పిన కేసీఆర్: మీరా కుమార్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే: డిగ్గీ
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కూమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని భూపాలపల్లిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
తెలంగామ ప్రజలను టీఆర్ఎస్ మభ్యపెడుతోందని, మాయమాటలు చెప్పి కేసీఆర్ సీఎం అయ్యారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసినా ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగింది మరొకటన్నారు.
ముఖ్యంగా తెలంగాణలో సామాజిక న్యాయం కరువైందన్నారు. తెలంగాణలో 1500 మంది రైతుల ఆత్మహత్యలు బాధాకరమని చెప్పిన ఆమె, బిహార్ ఎన్నికలతో ప్రధాని మోడీకి బుద్ధి వచ్చిందని, వరంగల్ ఉపఎన్నికతో కేసీఆర్‌కు కూడా బుద్ధి చెప్పాలని ఆమె అన్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రజలంతా కాంగ్రెసును గెలిపించుకోవాలని ఆమె అన్నారు.

కాంగ్రెస్‌తోనే తెలంగాణా: దిగ్విజయ్‌సింగ్
లోక్‌సభలో ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లిలో సభలో మాట్లాడారు. కేసీఆర్ అవలంభించిన నిరంకుశ పాలన వలనే ఉపఎన్నికలు వచ్చాయన్నారు.
తప్పుడు మాటలు చెప్పిన వారు ఒకరు ప్రధానమంత్రి కాగా, మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారని దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ మాటలు చెప్పడం తప్ప చేతలు లేవని ఆయన విమర్శించారు.
వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు, సకల జనుల సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రామచంద్ర కుంతియా, కొప్పుల రాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications