అల్లు అర్జున్ అరెస్టా? మజాకా?
Allu Arjun arrest: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత్ న్యాయసంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ అయింది.

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త దావానలంలా వ్యాపించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బారులు తీరుతున్నారు. తొలుత ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, భార్య స్నేహారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు.
నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, నాగవంశీ, మైత్రీ రవి సహా పలువురు ప్రముఖులు పోలీస్ స్టేషన్ బాట పట్టారు. విశ్వంభర సినిమా షూటింగ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రీకరణను క్యాన్సిల్ చేసుకున్నారు. భార్య సురేఖతో కలిసి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఫోన్ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అరెస్ట్ అయిన తరువాత కొద్దిసేపటికి ఆయనను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు వైద్య పరీక్షలు కొనసాగాయి. అనంతరం డిశ్చార్జ్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.
కాగా- అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మెగా కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేసినట్టయింది. ఇన్నాళ్లూ ఆయనను దూరం పెట్టిన ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఏకం అయింది. తన భార్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ఆయన ఇంటికి వెళ్లడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పవన్ కల్యాణ్ కూడా ఫోన్ చేసి పరామర్శించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అల్లు అర్జున్- మెగా కుటుంబం మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేనను కాదని తన ఆప్త మిత్రుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికడాన్ని మెగా కుటుంబం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది అప్పట్లో.
స్వయంగా పవన్ కల్యాణే కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పటికీ- సొంత కుటుంబ సభ్యుడై ఉండీ అల్లు అర్జున్ అక్కడికి ప్రచారానికి గానీ, పలకరింపుగా గానీ వెళ్లలేదు. అదే సమయంలో రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లడం అల్లు అర్జున్‌తో ఆంతర్యాన్ని మరింత పెంచింది. నాగబాబు పలుమార్లు అల్లు అర్జున్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు పెట్టడం తెలిసిన విషయమే.
ఇప్పుడు ఆయన అరెస్టు వ్యవహారం.. అన్నింటినీ మరిపించేలా చేసింది. కష్టకాలంలో తామందరూ ఒకటిగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి కుటుంబం. అల్లు అర్జున్ ఎప్పటికీ తమవాడిగానే చూస్తామనీ చాటిచెప్పినట్టయింది.












Click it and Unblock the Notifications