తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జేపీ నడ్డా
హైదరాబాద్: అత్యధిక సభ్యత్వ నమోదు చేయించినవారికే పదవులు దక్కుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. శనివారం పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట చేరుకున్నారు. బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు రాష్ట్ర పదాధికారులతో భేటీ అయ్యారు.
తెలంగాణలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై జేపీ నడ్డా ఆరా తీశారు. 15 రోజుల్లో నిర్దేశించుకున్న సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోగా.. లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు దిశానిర్దేశం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 77 లక్షల ఓట్లు, 8 ఎంపీ సీట్లు వచ్చిన విషయాన్ని జేపీ నడ్డా గుర్తు చేశారు. 77 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదన్నారు. అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు జేపీ నడ్డా సూచించారు.

అత్యధిక సభ్యత్వం నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని జేపీ నడ్డా స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదుతోపాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన అంశాలపై జేపీ నడ్డా ఆరా తీయడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు ప్రజాప్రతినిధులు నేతలు సభ్యత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.












Click it and Unblock the Notifications