Rain Alert: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు..!
భారీ వర్షాలతో తల్లడిల్లిన తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుండడం, నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో వానలు పడతాయని వివరించింది. మరోవైపు గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం వాయుగుండగా మారి.. అటు నుంచి తుఫాన్ గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
వచ్చే మూడు రోజులు పలు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇచ్చింది. మంగళవారం కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మం జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది.

సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదు అయింది. జిల్లాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ వర్షంతో పట్టణం జలమయమైంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో తెలంగాణ, ఏపీ తీవ్రంగా పంట నష్టం జరిగింది. చాలా ప్రాంతాల్లో రైతులు నష్టపోయారు. తెలంగాణ ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున పంటనష్ట పరిహారం చెల్లించనున్నారు.












Click it and Unblock the Notifications