Telangana: వచ్చే రెండు రోజులు అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

శుక్రవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ తో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ చిరు జల్లులు కురుస్తున్నన్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలతో వాగులు, చెరువులు నిండిపోయాయి. భూపాలపల్లి కేటీకే 2, కేటీకే 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తడెం జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. అటు ఏపీలో కూడా వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications