పీఎం మోడీ తెలంగాణాపై అక్కసు వెళ్లగక్కారు; విషం చిమ్ముతున్నారు: మంత్రి హరీష్ రావు
ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం గా మారాయి. పార్లమెంట్ లో మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు మోడీ పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా తెలంగాణ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణాపై మోడీ అక్కసు వెళ్లగక్కారు
తెలంగాణపై నరేంద్ర మోడీ మళ్లీ అక్కసు వెళ్లగక్కారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సమైక్య స్ఫూర్తికి ప్రధాని మోడీ తూట్లు పొడిచారని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ మీద మోడీకి ఎందుకింత కక్ష, ఎందుకింత వివక్ష అంటూ నిప్పులు చెరిగారు. ఎందుకు మోడీ తెలంగాణ పై విషం చిమ్ముతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయని, రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

రాష్ట్రంపై వివక్ష .. ప్రజలు గమనించాలి
ప్రధాని నరేంద్ర మోడీ మాటల్లోని ఆంతర్యాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. భద్రాద్రిలో ఏడు మండలాలను ఆంధ్రలో ఎలా కలిపారని ప్రశ్నించిన హరీష్ రావు ఆంధ్రాలో కలిపినప్పుడు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి ఎదురైందని , రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకపోవటం తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న వివక్షకు నిదర్శనం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణా రాష్ట్రం వచ్చిందని ప్రజల సంతోషం .. మోడీకి మాత్రం బాధ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉందని, 2014లో తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ అభివృద్ధి సాధ్యం అయ్యేదా అంటూ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని తెలంగాణ ప్రజలందరూ సంతోష పడుతుంటే ప్రధాని మోడీ ఎందుకు బాధ పడుతున్నాడో తెలియడం లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడినా అక్కసు వెళ్ళగక్కుతున్నారు అని, ద్వేషం బయటపెడుతున్నారని మంత్రి హరీష్ రావు ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదట, సుఖప్రసవం జరగలేదట అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చురకలంటించారు.

తెలంగాణా బాగుపడుతుంటే మోడీకి నచ్చటం లేదు
తెలంగాణ రాష్ట్రం బాగు పడుతుంటే మోడీకి నచ్చడం లేదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టారా? గిరిజన యూనివర్సిటీ సంగతి ఏమైంది? అంటూ హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బట్టేబాజ్ జూటే బాజ్ పార్టీ బీజేపీ అని, సోషల్ మీడియాలో బిజెపి ఫేక్ ప్రచారం చేస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ సోషల్ మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Recommended Video

తెలంగాణాకు అన్ని విషయాల్లో కేంద్రం మొండిచెయ్యి
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కాపాడే ప్రయత్నం చేస్తే బీజేపీ ప్రభుత్వం రైతులను ముంచే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతారని, సబ్సిడీల్లో కోత విధిస్తారని, ధరల పెంపు జరుగుతుందని, వివక్ష కొనసాగుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తుందని హరీష్ రావు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications