కొనఊపిరితో ఉన్న కాంగ్రెస్ కు ఒక్కఛాన్స్ ఇస్తే ఏం చేస్తుంది రేవంత్ : కేటీఆర్ సూటిప్రశ్న!!
తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లి లో నిర్వహించిన బి ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభ లో కాంగ్రెస్, బిజెపి లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ కొనఊపిరితో ఉందని ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎవరూ బతికించలేరని వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని ఒక్క ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని, ఏళ్ల తరబడి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

ఇక బీజేపీ ని టార్గెట్ చేసిన కేటీఆర్ తాము గెలిస్తే ప్రజల ఖాతాలలో 15 లక్షలు వేస్తామని మోడీ హామీ ఇచ్చారని ,మరి ఆ హామీని అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. తనను గెలిపించిన ప్రజలకు ఏం చెయ్యని మోడీ తన స్నేహితుడు అదానీ కోసమే పని చేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు.
50వ స్థానంలో ఉన్న అదానీని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి మోడీ కష్టపడుతున్నాడు అని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని పేర్కొన్న మంత్రి కేటీఆర్ మరోసారి తెలంగాణ లో కెసిఆర్ సర్కారును గెలిపిస్తే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలవుతుందన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకులను, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజల పైన ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
అంతేకాదు బెల్లంపల్లిలో 350 ఎకరాలలో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, 2 వేల కోట్ల రూపాయలతో సిమెంటు పరిశ్రమ విస్తరణ పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.బెల్లంపల్లిలో ఇంటింటికీ తాగునీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ పనులు చేపట్టినట్లు గా పేర్కొన్న మంత్రి కేటీఆర్, బెల్లంపల్లిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications