హైదరాబాద్‌పై బయటివారికీ హక్కు, టాలీవుడ్ ఎక్కడికీ పోదు: కెటిఆర్
హైదరాబాద్: త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమా పరిశ్రమ వారిని కూడా ఆకట్టుకునేందుకు అధికార తెరాస ప్రయత్నాలు చేస్తోంది. గురువారం నాడు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సినిమా పరిశ్రమ పైన స్పందించారు.
సినిమా పరిశ్రమ ఎక్కడికీ పోదని, ఇక్కడే (హైదరాబాద్)లో ఉంటుందని చెప్పారు. సినిమా పరిశ్రమకు తమ వంతు సాయం చేస్తామని చెప్పారు. సినీ పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాదును చేస్తామని చెప్పారు. హైదరాబాదులో తెలంగాణ వారికి ఎంత హక్కు ఉందో, బయటి వారికి అంతే హక్కు ఉందన్నారు.
తద్వారా సీమాంధ్రులకు కూడా అంతే హక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సినిమా పరిశ్రమ తరలిపోతుందని కొందరు ఆసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. పరిశ్రమలోని పేదవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

సినిమా ఇండస్ట్రీలోని అన్ని రంగాలు బాగుండాలన్నారు. అప్పుడే దేశంలో మన తెలుగు సినిమా పరిశ్రమకు మంచి పేరు వస్తుందన్నారు. హైదరాబాదులో నివసించే వారందరికీ సమాన హక్కులు అన్నారు. చిత్రపురి కాలనీకి రోడ్డును నిర్మిస్తామన్నారు. బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
సినిమా పరిశ్రమలో అర్హులైన పేదవారికి కళ్యాణ లక్ష్మి, పింఛన్లు వర్తింప చేస్తామన్నారు. పరిశ్రమలకు చెందిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
జనవరి 26న 300 మంది ఖైదీల విడుదల: నాయిని
సత్ప్రవర్తన కలిగిన మూడు వందల మంది ఖైదీలను జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. చంచల్‌గూడ జైలులో వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఏడాదిలో జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. జైళ్ల శాఖలో సంస్కరణలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జనవరి 26న సత్ప్రవర్తన గల ఖైదీల విడుదలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సుమారు 300 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications