ఇంకెన్ని ఫేక్ ముచ్చట్లు చెప్తారు సార్: మళ్ళీ బీజేపీ టార్గెట్ గా కేటీఆర్ సెటైర్లు
కర్నాటకలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు, ఇంకా ఎన్ని బూటకపు మాటలు చెబుతారు సార్? అంటూ ప్రశ్నించారు.
కేంద్రంలో అధికార బీజేపీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారని, తెలంగాణపై వివక్ష కొనసాగుతుందని, అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, పదేపదే కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న కేటీఆర్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతున్నారు. అంతేకాదు వివిధ సందర్భాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్.
నడ్డా వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్
ఇక తాజాగా కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన ఒక కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆపారంటూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఆయన దుయ్యబట్టారు. అన్ని ఫేక్ ముచ్చట్లు అంటూ టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదాన్ని కూడా పరిష్కరించలేకపోయారు అని పేర్కొన్నారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని మోడీ ఆపారంటా.. వ్యంగ్యంగా కేటీఆర్
అంతరాష్ట్ర సరిహద్దు వివాదాలను పరిష్కరించలేని వారు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపారంటా.. అంటూ సెటైర్లు వేశారు. ఇక ఈ విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కేటీఆర్ తనదైన శైలిలో మండిపడ్డారు. ఇంకా ఎన్ని ఫేక్ ముచ్చట్లు చెబుతారు అంటూ ప్రశ్నించారు. అంతేకాదు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారు అనేది వాస్తవం కాదని వారి నేతృత్వం లోని విదేశాంగ శాఖనే వెల్లడించిందని కేటీఆర్ గుర్తు చేశారు.

అమృత కాలం కాదు.. ఆ 'మృత' కాలం అంటూ పోస్ట్
ఇక కేంద్రంలోని బిజెపి అమృతకాలం అని చెబుతున్న దానికి మరింత సముచితమైన పేరును తాను కనిపెట్టానని పేర్కొన్న కేటీఆర్ అది మృతకాలం అంటూ పోస్ట్ చేశారు. దీనిపై మీరేం చెప్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఏ చిన్న అవకాశం దొరికినా సరే కేంద్రాన్ని, కేంద్రంలోని అధికార బీజేపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications