ఓ తండ్రి పంపిన సందేశం తృప్తినిచ్చిందన్న మంత్రి కేటీఆర్.. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే!!
తెలంగాణ పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిత్యం ట్విటర్లో, సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండటంతోపాటు, అనేక సమస్యలపై ప్రజలు కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తే కేటీఆర్ తక్షణం స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తారు. ఇక అలాంటి కొన్ని కొన్ని సందర్భాలు తనకు తృప్తినిస్తున్నాయి అని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కేటీఆర్ ను ఉద్దేశించి ఓ తండ్రి పోస్ట్
సోషల్ మీడియా వేదికగా కేంద్రంలోని అధికార బీజేపీని, రాష్ట్రంలోని బీజేపీ నేతలను, ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేసే కేటీఆర్ ఇదే క్రమంలో ట్విట్టర్ వేదికగా మంచి పనులు కూడా చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ తండ్రి కేటీఆర్ కు చేసిన ఒక పోస్ట్ ను ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆయన ప్రజాజీవితంలో తృప్తినిచ్చే సందేశాలలో ఇది ఒకటి అంటూ వెల్లడించారు. అసలు ఇంతకీ కేటీఆర్ ఆ తండ్రికి చేసిన సహాయం ఏమిటంటే..

కేటీఆర్ చొరవతో తమ కొడుకు బ్రతికాడని పోస్ట్
చిట్యాల కు చెందిన అశోక్ అనే ఒక తండ్రి, అగ్ని ప్రమాదంలో గాయపడి చావుబతుకుల్లో ఆసుపత్రిలో ఉన్న తమ కుమారుడు కార్తీక్ కి సత్వర చికిత్స అందించడానికి, సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్య ఖర్చులు ఇప్పించడానికి చొరవ చూపించాలని, తమ కుమారుని కాపాడాలని మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇక దీని పై వెంటనే స్పందించిన కేటీఆర్ ప్రమాదంలో గాయపడి చావుబతుకుల్లో ఉన్న కార్తీక్ ను కాపాడడం కోసం ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి సత్వర చర్యలు చేపట్టాలని, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చొరవ చూపడంతో తమ కుమారుడు బ్రతికాడు అని అశోక్ అనే తండ్రి సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.

దేవుడున్నాడో లేదో తెలియదు.. కానీ మా బాబును కాపాడిన దేవుడు మీరే
థాంక్యూ రామన్న.. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మా బాబు ని కాపాడిన దేవుడు మీరే అంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సదరు తండ్రి పేర్కొన్నారు. మీరు మాకు ఉన్నారన్న ఒక ధైర్యం మమ్మల్ని ముందుకు నడిపించిందని అశోక్ చెప్పారు. ఈరోజు మా బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తమకు చెక్కు కూడా వచ్చిందని అశోక్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామి మీకు వెయ్యేండ్ల ఆయుష్షు ఇవ్వాలని భగవంతుని వేడుకుంటున్నాను అంటూ సదరు తండ్రి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

తృప్తినిచ్చే సందర్భాలలో ఇలాంటి సందేశం ఒకటి అన్న మంత్రి కేటీఆర్
ఇక దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ప్రజా జీవితంలో అన్నింటికన్నా తృప్తినిచ్చే సందర్భాలలో ఇలాంటి సందేశం ఒకటి అంటూ ట్వీట్ చేశారు. చిట్యాల మండలం నుండి వెంకటేష్ ముదిరాజ్ అనే సోదరుడు పంపిన ఈ మెసేజ్ తనకు ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఒక కొడుకు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పటంతో మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications