తెలంగాణా దేశంలోనే లేనట్టు కేంద్రం తీరు; బడ్జెట్ లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదన్న మంత్రి కేటీఆర్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని, తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర పెద్దలు వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర బడ్జెట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ లో పేదలకు పనికి వచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణ అసలు దేశంలో భాగమే కాదు అన్నట్టుగా కేంద్రం తీరు
మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో మూడు వందల కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. జవహర్ నగర్ లో చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్ కేంద్రం తీరు పై నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నింటినీ బుట్టదాఖలు చేసి తెలంగాణ అసలు దేశంలో భాగమే కాదు అన్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించిందని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణాపై కేంద్రానిది సవతితల్లి ప్రేమ
తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమను చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, అయినప్పటికీ రాష్ట్రంలో మౌలిక వసతులకు కేంద్రం బడ్జెట్లో నిధులు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణా రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించిన కేంద్రం
దేశంలో భౌగోళికంగా పదకొండవ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రమైన తెలంగాణ దేశానికి తిండి పెట్టే రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయం తాము చెబుతున్నది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతుందని ఆయన వెల్లడించారు. అలాంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఏ విధమైన సహకారాన్ని అందించడం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాన్ని కేంద్రం విస్మరించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో వరదలొస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు కానీ గుజరాత్ కు
హైదరాబాద్ లో వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదని, గుజరాత్ లో వరదలు వస్తే మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టుగా కేంద్రానికి సహకారం ఆశించామని, కానీ ఆ సహకారం అందడం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 60 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ఏళ్ళల్లో సాధించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన
రాష్ట్రంలో 7వేల కోట్లపై చిలుకు నిధులతో ప్రభుత్వ స్కూళ్ళలో రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి రూపురేఖలు మార్చనున్నట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పేదలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించిన మంత్రి కేటీఆర్ త్వరలోనే 58, 59 జీవోలను తీసుకొస్తామని, ప్రతి పేదవాడికి పట్టాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానికి అని తేల్చి చెప్పారు. సీఎం కెసిఆర్ సారథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా తెలంగాణలో సంక్షేమం ఆగదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications