'ప్రవల్లిక మృతిపై రాద్దాంతం, చనిపోతుందని పేరెంట్స్‌కు తెలుసు'
గాంధీ ఆసత్రి, నీలోఫర్ ఆసుపత్రులలో జరిగిన సంఘటనలపై మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం నాడు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: గాంధీ ఆసత్రి, నీలోఫర్ ఆసుపత్రులలో జరిగిన సంఘటనలపై మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం నాడు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో ప్రవళిక మృతిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
ప్రవళిక మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదన్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న ప్రవళిక చనిపోతుందని తల్లిదండ్రులకు ముందే తెలుసని తెలిపారు. గ్లూకోజ్ బాటిల్‌లో పురుగులు ఉండే అవకాశమేలేదన్నారు.
అలాగే, నీలోఫర్‌లో జరిగిన ఘటనపై కూడా ఆదేశించామని తెలిపారు. ప్రాథమిక వైద్య శాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బాలింతల మృతి... శస్త్ర చికిత్స నిలిపివేత
రోజుల వ్యవధిలో అయిదుగురు బాలింతలు మృతి చెందిన నేపథ్యంలో నిలోఫర్ ఆసుపత్రిలో కొన్ని రోజుల వరకు అన్ని రకాల శస్త్ర చికిత్సలు నిలిపేశారు. ఆపరేషన్ థియేటర్లలో ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పరిశీలించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

అన్నింటి పరిశీలన
ఇప్పటికే థియేటర్లలోని గోడలు, టేబుళ్లు, శస్త్ర చికిత్సకు వాడే పరికరాలు నుంచే కాకుండా, రోగుల రక్తనమూనాలను తీసుకొని ఐపీఎంతోపాటు ఉస్మానియాలోని పరీక్ష కేంద్రాలకు పంపినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు.

ఔషధాలు కారణం కాదు
బాలింతల మృతికి ఔషధాలు పనిచేయకపోవడం కారణం కాదని వైద్యులు చెప్పారు. అదే జరిగితే అంతకు ముందు బాలింతలకూ ఇవే మందులు ఇచ్చామని, వారంతా క్షేమంగా ఉన్నారన్నారు. వైద్యుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? థియేటర్ల శుభ్రత.. ఇతర కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

విచారణకు ఆదేశం
ఇటీవలి కాలంలో ఆపరేషన్లలో అయిదురుగు బాలింతలు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగడంతో పెద్ద దుమారం రేగింది. ఆఘమేఘాల మీద ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసింది.

నివేదిక సమర్పణ
వైద్యుల నిర్లక్ష్యంతోపాటు థియేటర్లల్లోని వసతులు, పరిశుభ్రత, ఇతరత్రా అన్ని విషయాలను పరిశీలించి ఈ కమిటీ సోమవారం రాత్రి నివేదికను సమర్పించింది. గాంధీ, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ఆస్పత్రులకు చెందిన నిపుణులతో ఎక్స్‌టర్నల్ కమిటీని కూడా వేస్తున్నట్లు డీఎంఈ డాక్టర్ రమణి తెలిపారు. నాలుగైదు రోజుల పాటు అత్యవసర సిజేరియన్లు ఆపేశారు.












Click it and Unblock the Notifications