మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. పాలమూరు రాజకీయాలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికరవ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు తెలంగాణాలో సంచలనంగా మారింది. సైబరాబాద్ పోలీసులు ఈ హత్య కుట్ర ను భగ్నం చేశారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు పదిహేను కోట్ల రూపాయల సుపారి అందిందని చెప్పిన పోలీసులు హత్యకు కుట్ర పన్నిన ఎనిమిది మందిని బుధవారం అరెస్టు చేశారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో బీజేపీ నేత మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బిజెపి మహిళా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ పాత్రపై దర్యాప్తు చేపడతామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడటం మంచిదికాదు
తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చెయ్యటం తెలంగాణా మంత్రులకు షాకింగ్ గా ఉంది. దీనిపై తెలంగాణా మంత్రులు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్ర ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, ఉండాలి అనుకునే వాళ్ళు పని చేసి ప్రజల ఆదరణ పొందాలి కానీ రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడటం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

పాలమూరు జిల్లా ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చెయ్యొద్దు
హత్య రాజకీయాల కుట్రలు చేయడం దారుణమని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారంనాడు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్రను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు మహబూబ్ నగర్ జిల్లా ను సస్యశ్యామలం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పాలమూరు జిల్లా ప్రశాంతమైన జిల్లా అని, ఆ వాతావరణాన్ని కలుషితం చేయొద్దని ఆయన పేర్కొన్నారు.

సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు ప్రజలకు చెప్పాలి
మానవత్వంతో పనిచేయడానికి, సేవ చేయడానికి కులాలు, మతాలు అనే ఎల్లలు ఉండవు అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.ఇదే సమయంలో దుర్మార్గాలు చేసేవారికి కూడా కులాలు, మతాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నానికి కుట్ర చేసిన కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి హత్యల కుట్రలు హేయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications