ఆటోలు, క్యాబ్ డ్రైవర్ ల బంద్ పై కార్మికసంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు!
తెలంగాణ రాష్ట్రంలో తమ న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించాలని, తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రైవేట్ ఆటో, క్యాబ్, స్కూల్ బస్ డ్రైవర్ లు ఈ రోజు అర్దరాత్రి నుండి నిరవధిక బంద్ కు దిగుతున్నారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చెయ్యని కారణంగానే సమ్మె బాట పట్టామని జేఏసీ నేతలు అంటున్నారు.
ఆటో డ్రైవర్ ల సమ్మె.. డిమాండ్లు ఇవే
ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలని, ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలు పెంచాలని కోరుతున్నారు. తమ డిమాండ్ లను పరిష్కరిస్తేనే, తమకు న్యాయం చేస్తేనే వాహనాలు రోడ్డెక్కుతాయని వారు తేల్చి చెప్పారు.

ఆటో డ్రైవర్ లకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో కార్మికులు సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించినట్లే ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
రవాణా శాఖ అధికారులు, కార్మిక ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం
2015 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని పేర్కొన్న మంత్రి, ప్రస్తుత పెట్రోల్, డీజిల్, వాహనాల ధరలను పరిగణనలోకి తీసుకుని చార్జీల పెంపుపై రవాణా శాఖ అధికారులు, కార్మిక ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.
ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే రెట్రోఫిట్‌మెంట్ పైనా ప్రకటన
పట్టణాల్లో కాలుష్యం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే రెట్రోఫిట్‌మెంట్ వారికి ప్రభుత్వం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనేవారికి కూడా సహకారం ఉంటుందని తెలిపారు.
ఆటో కార్మికుల సంక్షేమం కోసం చర్యలు
ఆటో కార్మికుల కుటుంబాలకు రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించి చర్చలకు రావాలని మళ్లీ విజ్ఞప్తి చేశారు.













Click it and Unblock the Notifications