నేడు అర్దరాత్రి నుండి ఆటోలు, క్యాబ్ లు, స్కూల్ వ్యాన్ ల బంద్!
తెలంగాణలో ఆటోలు, క్యాబ్‌లు, యాప్ ఆధారిత వాహనాలు, స్కూల్ వ్యాన్‌ల సేవలు నేటి అర్దరాత్రి నుండి నిరవధికంగా నిలిచిపోనున్నాయి. ఆటో, క్యాబ్, ప్రైవేట్ రవాణా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆదివారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సోమవారం నుంచి రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ హామీలు
డ్రైవర్ల సంక్షేమం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని జేఏసీ ఆరోపిస్తోంది. ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలు పెంచాలని కోరుతున్నారు.

ప్రభుత్వ యాప్ సేవలు ప్రారంభించాలని సూచన
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బైక్, ట్యాక్సీలను నియంత్రించాలని, వాటి స్థానంలో ప్రభుత్వ యాప్ సేవలు ప్రారంభించాలని సూచిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
ప్రజాభవన్ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరిక
డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరుతూ, స్పందన లేకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేసి అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ కూడా బంద్‌కు మద్దతు తెలిపింది. రాష్ట్రంలో సుమారు 7.5 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో బంద్ ప్రభావం విస్తృతంగా ఉంటుంది.
ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు
పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ బంద్ ఎప్పటివరకు కొనసాగుతుంది. ప్రభుత్వం వీరి డిమాండ్ ల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications