బీజేపీ కార్యకర్తలా.. ప్రభుత్వాన్ని బెరిరించినట్టు గవర్నర్ వ్యాఖ్యలు: మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తున్నదని, రాజ్ భవన్ కు ఎలాంటి మర్యాద ఇవ్వడం లేదని తమిళిసై మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీకి, హోం మంత్రి అమిత్ షా కి తాను నివేదిక ఇచ్చానని వెల్లడించిన తమిళిసై ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని ఆమోదించని కారణంగా ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమాన పరుస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా స్పందించారు.

తాను తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్ చెప్పడం సరికాదు
శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు మహిళలంటే ఎనలేని గౌరవం అని పేర్కొన్నారు. మహిళలను మర్యాదగా చూసుకునే సంస్కృతి తమదని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గవర్నర్ బిజెపి నేతలతో కలిసి మాపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. తాను తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్ చెప్పడం సరికాదని సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు. గవర్నర్ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని సత్యవతి మండిపడ్డారు.

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి
వంద మందికి పైగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారో చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోవడం వల్లనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకున్నామని చెప్పిన సత్యవతి రాథోడ్ గవర్నర్ కు అవమానం జరిగితే ఇక్కడే మాట్లాడాలని, అలా కాకుండా ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని కలిసిన తర్వాత ప్రభుత్వాన్ని బెదిరించినట్టు మాట్లాడారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

గవర్నర్ బీజేపీ కార్యకర్తలా మాట్లాడారు
బిజెపి కార్యకర్త తరహాలో గవర్నర్ మాట్లాడినట్లుగా భావిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లి మాట్లాడిన మాటలు చూస్తుంటే గవర్నర్ మనసులో ఏముందో అర్థమవుతోందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇక రోడ్డు మార్గం ద్వారా మేడారం వెళ్లానని, శ్రీరామనవమికి భద్రాద్రికి రోడ్డు మార్గం ద్వారా వెళతానని గవర్నర్ చెబుతున్నారని పేర్కొన్న సత్యవతి రాథోడ్ రోడ్డు మార్గంలో వెళ్లినంత మాత్రాన హోదా తగ్గదంటూ వ్యాఖ్యానించారు.

గవర్నర్ గవర్నర్ లాగా ప్రవర్తిస్తే మర్యాద ఉంటుంది
గవర్నర్ తమిళిసై ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ తరపున అనేక సార్లు పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై వేరొకరిని రాజకీయాల నుంచి వచ్చారు అని ఆమోదించలేదని చెప్పడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గవర్నర్ గవర్నర్ లాగా ప్రవర్తిస్తే మర్యాద ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications