తెలంగాణా ప్రజలకు శుభవార్త.. దసరా నుండి గ్రామాలకు మహర్దశ!
తెలంగాణలో గ్రామాల వారికి శుభవార్త. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పరిధిలో ఎంపికైన రోడ్ల పనులను దసరా పండుగకు ముందే ప్రారంభించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
తాజాగా సెక్రటేరియట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క ఈ విషయంపై మాట్లాడారు. హ్యామ్ పద్ధతిలో ఎంపికైన ప్యాకేజీలకు సంబంధించి కాంట్రాక్టర్ సంస్థలు వెంటనే పనులు మొదలుపెట్టేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పనులు ప్రారంభించడమే కాకుండా, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మెరుగుపడితే మండలాలు, జిల్లా కేంద్రాలకు ప్రజల రాకపోకలు సులభం అవుతాయని, అలాగే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు త్వరగా తరలించుకునే అవకాశం పెరుగుతుందని మంత్రి సీతక్క వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో రోడ్లు గుంతలతో నిండి ఉన్నాయి. వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం, కొన్ని చోట్ల మట్టి రోడ్లుగా మారిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.
దీని వల్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు, సరుకు రవాణా వాహనాలు ఇబ్బందులు పడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త రహదారుల నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాహనాల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలకు, చిన్న వ్యాపారాలకు, సేవా రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి.
మంత్రి సీతక్క జీరాంజీ నిధులతో నిర్మిస్తున్న పంచాయతీ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను కూడా సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ భవనాల కోసం అదనపు నిధులు సేకరించేందుకు ఎంపీ లాడ్స్ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఎంపీ కనీసం ఒక కోటి రూపాయలు కేటాయించేలా త్వరలో లేఖలు రాస్తానని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు. హ్యామ్ రోడ్లు పూర్తయితే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుంది.













Click it and Unblock the Notifications
