బీసీలకు బీజేపీ పంగనామం.. మంత్రి సీతక్క ఫైర్
Minister Seethakka: రాహుల్ గాంధీ ఇచ్చిన 'ఎవరెంతో వారికంత' అనే నినాదంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రకుల రెడ్డి సామాజిక వర్గాల నుండి వచ్చినప్పటికీ, వెనుకబడిన వర్గాలకు మద్దతుగా బీసీ రిజర్వేషన్లను ముందుకు తీసుకువస్తున్నందుకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీ వేదికగా ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి
బీజేపీ పార్టీ తెలంగాణ గల్లీలలో మెప్పు కోసం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లులకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, అయితే అదే బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో ఆ బిల్లులను ఆమోదింపజేసే బాధ్యత లేదా అని సీతక్క ప్రశ్నించారు. అసెంబ్లీలో మద్దతు ఇవ్వడం అనేది కేవలం గల్లీ రాజకీయాల కోసమేనని, వారికి బీసీల ఆత్మగౌరవం, హక్కులు పట్టవని ఆమె అన్నారు. ఓట్ల కోసం కులాల మధ్య, వర్గాల మధ్య విభజన చేయడం తప్ప, సామాజిక న్యాయం కోసం బీజేపీ ఎప్పుడూ పని చేయదని సీతక్క ఆరోపించారు.

మోదీ పుట్టిన గుజరాత్‌లో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా ముస్లింలు బీసీలుగా పరిగణింపబడుతున్నారని, ఇది కొత్త విషయం కాదని ఆమె స్పష్టం చేశారు. తరతరాలుగా వెనుకబడిన ముస్లింలను బీసీలుగా పరిగణిస్తున్నాం తప్ప, కొత్తగా ఏ ముస్లిం వర్గాన్ని చేర్చలేదు లేదా తీసివేయలేదని ఆమె అన్నారు. మోదీ పేరికే బీసీ అని, ఆయన డీఎన్‌ఏలో బీసీ వ్యతిరేక భావజాలం ఉందని సీతక్క విమర్శించారు. ఆయన పీఎంఓ (PMO)లో బీసీలు, అట్టడుగు వర్గాలకు చెందిన అధికారులు లేరని ఆమె పేర్కొన్నారు. ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్లు కావాలని అడిగినప్పుడు, క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు రిజర్వేషన్ పనికి రాదని చెప్పారని ఆమె గుర్తు చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఆవశ్యకత
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో బీసీలకు కులవృత్తులపై కూడా ఆధారపడే పరిస్థితి లేదని సీతక్క తెలిపారు. అందుకే జనాభా, వెనుకబాటు ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. లేకపోతే బీజేపీని ఊర్లలోకి రాకుండా తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు బీసీ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీపై ప్రశంసలు
రాహుల్ గాంధీని యుగ పురుషుడు అని అభివర్ణిస్తూ, బీసీలకు రిజర్వేషన్లు పెరగాలని ఆయన పాదయాత్ర చేశారని సీతక్క ప్రశంసించారు. బీసీల హక్కులు, ఆత్మగౌరవం బీజేపీకి పట్టవని ఆమె అన్నారు. గల్లీలో ధర్నాలు చేయడం కాకుండా, దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు.












Click it and Unblock the Notifications