నీచంగా ప్రవర్తిస్తారా ?.. కేసీఆర్‌ను ముట్టుకుంటే మాడి మసైపోతారు : శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నోటికి అదుపులో పెట్టుకోక పోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు స్వచ్ఛందంగా జరుపుతున్నారని పేర్కొన్నారు. ఇది చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలే ఉన్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో కేక్ కట్ చేశారు. 200 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు రూ.15 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న లబ్దిదారులకు రూ.7.50 లక్షలు అందించారు. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులో మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని KCR ఎకో పార్క్ లో రూ.1 కోటితో ఏర్పాటు చేయనున్న వివిధ రకాల పక్షుల ఎంక్లోజర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

పరమ నీచంగా కాంగ్రెస్ నేతల ప్రవర్తన
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించే దాకా కూడా ఈ కాంగ్రెస్ నేతలు స్పందించలేదని దుయ్యబట్టారు. అప్పుడు దాకా కాంగ్రెస్ నేతలు ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. అస్సాం సీఎం వ్యాఖ్యలను ఖండించిన కేసీఆర్‌పై నీచంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.

పుట్టిన రోజున గాడిదపై ఊరేగిస్తాం అంటారా..
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపడతామనడం దారుణమన్నారు శ్రీనివాస్ గౌడ్. గాంధీ కుటుంబం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పారు. నెహ్రు , ఇంధిరా గాంధీ, రాజీవ్ గాంధీల సేవలను కొనియాడారు. అలాంటి వ్యక్తికి గౌరవించాల్సింది పోయి.. పుట్టిన రోజున గాడిదపై ఊరేగిస్తాం అనడం దుర్మార్గం అని మండిపడ్డారు. తమ నేత ఎప్పుడూ పేదలకు అండగా ఉండాలంటారే తప్ప.. ఇలా నీచంగా చేయమని చెప్పరని టీపీసీసీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలకు గుణపాఠం తప్పదు..
అటు బీజేపీ నేతలపై శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. ముందు విమర్శించే తీరును మార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్‌ను ముట్టుకోవాలని ప్రయత్నిస్తే మాడి మసి అయిపోతారని హెచ్చరించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications