ఈ సంక్రాంతికి భీమవరంలో ఉంటా, ఇద్దరు సీఎంలు కలిశారుగా: తలసాని
హైదరాబాద్: తాను ఈసారి సంక్రాంతి పండుగకు కూడా భీమవరం వెళ్తున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు చెప్పారు. అయితే తాను వెళ్లేది కోడి పందేలకు కాదని, మిత్రులు ఆతిథ్యం ఇవ్వడం వల్ల వెళ్తున్నానని చెప్పారు.
ఈ సంక్రాంతికి భీమవరంలో ఉంటానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్రుల పైన మంత్రులు, తెరాస నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం తలసాని పై వ్యాఖ్యలు చేశారు.
తలసాని ఇంకా మాట్లాడుతూ... పేదలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి, చేయాల్సిన దాని పైన ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని హితవు పలికారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు (కెసిఆర్, చంద్రబాబు) పరస్పరం గౌరవించుకుంటున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. మరో మూడేళ్లలో హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్పారు.
పేదవాళ్ల ఆకలి తెలిసిన వ్యక్తి కెసిఆర్ అన్నారు. ప్రభుత్వం మంచినీరు, విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్ అవసరాల గురించి పట్టించుకున్న పాపానపోలేదన్నారు. మంచినీటి ప్రాధాన్యతను గుర్తించే కేసీఆర్ గోదావరి నీటిని నగరానికి తీసుకు వచ్చారన్నారు.
లేకుంటే వచ్చే వేసవిలో నగరానికి నీటి కటకట తప్పేదికాదని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. పేదలందరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్య వసతులు కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications