తిరుమల దర్శనాలపై తుమ్మల సంచలనం: ఎలాగైనా చంద్రబాబును ఒప్పించాలి: రేవంత్‌కు లేఖ
Chandrababu Naidu- Revanth Reddy meeting: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించబోతోన్నారు. నేడు దీనికి ముహూర్తం. ఈ సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ఏర్పాటైంది. బేగంపేట్‌లోని ప్రజాభవన్ దీనికి వేదిక.
ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరభ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారితో పాటు ఆర్థికం, జలవనరులు, విద్యుత్, మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు.

విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేసిన విషయం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన శనివారం సమావేశమౌదామంటూ సూచించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు.
ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఈ లేఖను పంపించారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆ హోదాలో హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి.
1,000 కిలో మీటర్ల మేర విస్తరించివున్న ఏపీ కోస్తా తీరంలో తెలంగాణకూ వాటా కావాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో నిర్మితమౌతోన్న పోర్టుల్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం ఓడరేవుల్లో తెలంగాణకు వాటా కావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోన్నట్లు సమాచారం.
ఈ పరిస్థితుల మధ్య రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే తెలంగాణకు చెందిన భక్తులకు ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రులు భేటీ సందర్భంగా ఈ డిమాండ్‌పై చంద్రబాబు వద్ద చర్చించాలని సూచించారు.
తెలంగాణ భక్తులకు తాము ఇచ్చే శ్రీవారి దర్శనం లేఖలు చెల్లుబాటు అయ్యేలా నిర్ణయాలను తీసుకోవాలని తుమ్మల అన్నారు. అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫారసు లెటర్లను టీటీడీ అధికారులు పట్టించుకోవట్లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని గుర్తు చేశారు. టీటీడీలో తెలంగాణకు కూడా భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.
వారంతపు రోజులు, పండగ సమయాల్లో శ్రీవారి దర్శనం కోసం అనేకమంది భక్తులు సిఫారసు లేఖల కోసం తమ వద్దకు వస్తుంటారని పేర్కొన్నారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏకాభిప్రాయానికి రావాలని, ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications