బనకచర్ల ప్రాజెక్టుపై ముదురుతున్న వివాదం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు పేర్కొనడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖకు లేఖ రాసారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ GWDT (గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యూనల్), పునర్విభజన చట్టం (APRA 2014)కు విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. PFRను కేంద్రం ఇంకా ఆమోదించక ముందే Detailed Project Report (DPR) కోసం ఏపీ దరఖాస్తు చేయడం అనైతికమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే PFRను తిరస్కరించాలని, DPR సమర్పణను ఆపేయాలని కోరారు. టెండర్లు పిలవకుండా ఏపీని నియంత్రించాలని సూచించారు.

అలానే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తోసిపుచ్చారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖ మంత్రులకు లేఖ రాశానన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని.. చట్టపరంగా ముందుకెళ్తున్నామని వివరించారు.
నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్‌ఎస్సే అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది వాటాను కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేశారని.. బీఆర్‌ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి, మాల్యాల నుంచి నీటిని తరలించారని గుర్తు చేశారు. జగన్, కేసీఆర్ మధ్య అవగాహనతోనే తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో గతంలో కృష్ణా, గోదావరి నదులపై వున్న వివాదాల కంటే, ఇప్పుడు బనకచర్ల మరో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications