Telangana: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటనలు.. పశువులకు కూడా పరిహారం..
భారీ వర్షాలతో ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు అల్లాడిపోయాయి. ఖమ్మం నగరాన్ని వరద నీరు చుట్టు ముట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే నగరం తేరుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పర్యటిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వర్షాలు పడుతున్నప్పటి నుంచి ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు చేస్తున్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను సీతక్క పరిశీలించారు. తాజాగా సీతక్క మహబూబాబాద్ ఆర్‌ఎన్‌బీ గెస్ట్ హౌస్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఎకరాకు రూ.10 వేల పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. వర్షాల వల్ల చనిపోయిన పశువుల యజమానులకు కూడా పరిహారం ఇస్తామని ప్రకటించారు. మొదటిసారిగా పశువులకు పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు.

గ్రామాల వారీగా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. మహబూబాబాద్ కు ముందుగా రెడ్ అలెర్ట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ సడెన్ గా భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. ఎవరూ కూడా వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోకుండా ప్రయత్నాలు చేశామన్నారు. రావిరాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి వివరించారు. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. తక్షణ సాయం కింద సీఎం రూ.5 కోట్లు విడుదల చేశారని సీతక్క తెలిపారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గత రెండు రోజులు నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఇటు సూర్యాపేట జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు.












Click it and Unblock the Notifications