మెరిసిన బన్సీలాల్‌పేట్ మెట్లబావి: సిటీకి యునెస్కో గుర్తింపు తెస్తామన్న కేటీఆర్
హైదరాబాద్: యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు తెస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నగరంలోని బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా బావిని పునరుద్ధరించారు. దీంతో ఇదొక ప్రత్యేక పర్యాటక ప్రదేశంగా కనిపిస్తోంది.

మెరిసిన 3 శతాబ్ధాల బన్సీలాల్‌మెట్ల బావి
కాగా, బన్సీలాల్ మెట్ల బావిని 3 శతాబ్దాల క్రితం నిర్మించారు. ఇటీవల సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ బావిని జీహెచ్ఎంసీ పునరుద్ధరించింది. రూ. 10 కోట్లతో పురాతన బావికి మరమ్మతులు చేసి ఆధునీకరించారు. దీంతో మెట్ల బావి కొత్త అందాలు సంతరించుకుంది. అనాటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు కార్యాచరణ చేపట్టారు.
కళలు, కళాకారులు, సంస్కృతి చిహ్నంగా మెట్లబావి
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే విధంగా బన్సీలాల్‌పేట్ మెట్లబావి రూపకల్పన జరిగిందన్నారు. చరిత్ర, వారసత్వ చిహ్నాల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కళలు, కళాకారులు, సంస్కృతి చిహ్నంగా మెట్లబావి మారాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
బన్సీలాల్‌పేట్ మెట్లబావి అదనపు ప్రత్యేకతలుగా..
బన్సీలాల్‌పేట్ మెట్లబావిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా ఆధునీకరించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మ్యూజియం, యాంఫీ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కులీకుతుబ్ షా టూంబ్స్ వద్ద 6 మెట్ల బావుల ఆధునీకరణ జరిగిందన్నారు. మెట్లబావులు పునరుద్ధరించిన ఆగాఖాన్ ఫౌండేషన్‌కు యునెస్కో అవార్డు వచ్చిందన్నారు. చరిత్ర, వారసత్వ చిహ్నాల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
బన్సీలాల్ మెట్లబావి అంతర్జాతీయ పర్యాటక కేంద్రం
మరో మంత్రి తలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బన్సీలాల్ మెట్లబావి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలుస్తుందన్నారు. స్థానికులు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు. భాగ్యనగర చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాలను.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రత్యేక చోరవతో పునరుద్ధరిస్తున్నాయని తెలిపారు. బన్సీలాల్ పేట్‌లో 3 శతాబ్ధాల కిందట నిర్మించిన నాగన్నకుంట మెట్లబావికి కొత్త అందాలను అద్దారని తెలిపారు. కాగా, మెట్లబావి ప్రారంబోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆధునీకరించిన మెట్లబావిని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.












Click it and Unblock the Notifications